7 కోట్లు విలువ చేసే భూమి.. రూ.4 లక్షలకే సొంతం…!
Viral News: ఓ భూమి విషయంలో మహిళ జాక్‌పాట్ కొట్టింది. రూ.7 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.4 లక్షలకే సొంతం చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఇందిరాపురంలోని న్యాయ్ ఖండ్ ప్రాంతంలో ఉన్న 350 చదరపు మీటర్ల భూమిని స్థానిక ప్రాంతానికి చెందిన లత అనే మహిళ 1988లో కొనుగోలు చేసింది. అప్పట్లో రూ.50,000 కట్టి ఈ భూమిని సొంతం చేసుకుంది. అయితే ఘజియాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ వారి వల్ల పొరపాటు జరిగింది.
ఆ భూమిని అథారిటీ ఆల్రెడీ వేరొకరికి అమ్మేసింది. అయితే ఇది సరిగ్గా రికార్డు చేయకపోవడంతో పొరపాటుగా లతకు కూడా అమ్మేసింది. ఆ తర్వాత ముందు కొనుగోలు చేసిన యజమాని అథారిటీని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. అథారిటీ లతకు నోటీసులు పంపి ఆ భూమి ఆల్రెడీ వేరొకరు కొనుగోలు చేసుకున్నారని.. కావాలంటే నష్టపరిహారం చెల్లిస్తామని ఆ భూమిని వదిలేయాలని కోరింది. ఇందుకు లత ఏమాత్రం ఒప్పుకోలేదు. కన్‌స్యూమర్ ఫోరమ్‌లో కేసు వేయడంతో వాయిదాలు పడుతూ 2009లో లతకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తర్వా ఘజియాబాద్ అథారిటీ అధికారులు హైకోర్టుకు వెళ్లగా అక్కడ పిటిషన్‌ను రద్దు చేసారు.
దాంతో 2010లో అథారిటీ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. దాదాపు 30 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో నడిచిన ఈ కేసు తీర్పు ఈ ఏడాది ఏప్రిల్ 5న తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తీర్పు కూడా లతకే అనుకూలంగా వచ్చింది. ఇది అధికారుల పొరపాటని లతది తప్పేమీ లేదని తేల్చింది. అంతేకాదు ఇన్నేళ్లు ఆమెను కోర్టుల చుట్టూ తిప్పించినందుకు రూ.1లక్ష పరిహారంతో పాటు 1988 కాలంలో 350 చదరపు మీటర్ల భూమి ఉన్న విలువకే ఇప్పుడు 500 చదరపు మీటర్ల భూమిని ఇవ్వాలని ఆదేశించింది. దాంతో చేసేదేమీ లేక ఘజియాబాద్ మున్సిపల్ అథారిటీ 500 చదరపు మీటర్ల భూమిని లత పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే ఇప్పుడు ఆ భూమి విలువ రూ.7 కోట్లు. కానీ అథారిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ భూమి లతకు రూ.4 లక్షలకే దొరికింది.