18 ఏళ్ల క్రితం తప్పిపోయి.. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ప్రత్యక్షం
Instagram: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ ఓ కుటుంబంలో సంతోషాన్ని నింపింది. 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన సోదరుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ప్రత్యక్షం అవడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక హాథీపూర్ గ్రామానికి చెందిన రాజకుమారి అనే మహిళ సరదాగా ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా.. ఒక రీల్ చూసి అవాక్కైంది.
ఆ రీల్‌లో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ యువకుడు ఎవరో కాదు.. 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన సోదరుడు బాలగోవింద్. 18 ఏళ్ల క్రితం తన సోదరుడు బాల గోవింద్ ఉద్యోగ రిత్యా ముంబై వెళ్లాడట. ఆ తర్వాత పనిలో పడి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండేవాడు. అతను తన స్నేహితులను కూడా కలవడం తగ్గించేసాడు. ఓసారి బాలగోవింద్ స్నేహితులంతా కాన్పూర్ వెళ్లారు కానీ అతను మాత్రం రాలేదు. ఆ తర్వాత బాలగోవింద్‌కి ఆరోగ్యం పాడవడంతో ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అలా కాన్పూర్ రైలు ఎక్కాల్సిందిపోయి జైపూర్ రైలు ఎక్కేసాడు. ఏం చేయాలో తెలీక స్టేషన్‌లో కూర్చుండిపోయాడు.
అప్పుడు ఓ వ్యక్తి బాలగోవింద్ పరిస్థితి చూసి తన ఫ్యాక్టరీలో పని ఇప్పించాడు. అలా బాలగోవింద్ జైపూర్‌లో స్థిరపడిపోయాడు. ఓ మంచి అమ్మాయిని కూడా చూసి పెళ్లి చేసుకున్నాడు. బాల గోవింద్ రీల్ చూడగానే తన సోదరి రాజకుమారి గుర్తుపట్టింది. బాల గోవింద్‌కి ఒక పన్ను విరిగిపోయి ఉంటుందని.. అది చూసే తన తమ్ముడు అని గుర్తుపట్టానని రాజకుమారి తెలిపింది. ఆ రీల్‌ను స్థానిక పోలీసులకు చూపించి ఫిర్యాదు చేయడంతో వారు జైపూర్ పోలీసులను అలెర్ట్ చేసారు. అలా 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన సోదరుడు ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు.