Viral News: 3 సెకెన్ల‌ రివ్యూతో రూ.120 కోట్లు అర్జిస్తోంది..!

Viral News: సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని క‌నీవినీ ఎరుగ‌ని కొత్త కొత్తగా డ‌బ్బులు సంపాదించే మార్గాలు వ‌చ్చేసాయి. ఈ మార్గాల ద్వారా ఉద్యోగం చేస్తే వ‌చ్చే డ‌బ్బు కంటే రెట్టింపు సంపాదించుకునే అవ‌కాశం ఉంది. అందుకే చాలా మంది సాధార‌ణ ఉద్యోగాలు వ‌దిలేసి సోష‌ల్ మీడియాపై పడ్డారు. సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులు సంపాదించే మార్గాల్లో ప్రొడ‌క్ట్ రివ్యూ ఒక‌టి. ఒక ప్రొడ‌క్ట్‌ని కొనుగోలు చేసి దాని గురించి క్లుప్తంగా రివ్యూ ఇస్తే ఆ కంపెనీ వారు ఎంతో కొంత డ‌బ్బు ఇస్తారు. వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేసినందుకు గానూ వ‌స్తున్న వ్యూస్‌ని బ‌ట్టి అటు యూట్యూబ్ కూడా డ‌బ్బులు ఇస్తుంది. ఇంత‌కంటే ఏం కావాలి చెప్పండి. ఛానెల్ కాస్త క్లిక్ అయితే చాలు.. కోట్ల‌ల్లో డ‌బ్బులు సంపాదిస్తున్న యూట్యూబ‌ర్లు బోలెడు మంది ఉన్నారు.

వారిలో చైనాకు చెందిన చెంగ్ ఒక‌రు. ఈమె డూయిన్ అనే యాప్‌లో ప్రొడ‌క్ట్ రివ్యూలు ఇస్తుంటుంది. డూయిన్ అనేది చైనాలో ప్ర‌వేశ‌పెట్టిన సోష‌ల్ మీడియా యాప్. దీనిని టిక్‌టాక్‌కి ప్ర‌త్యామ్నాయంగా లాంచ్ చేసారు. చెంగ్ ఈ యాప్‌ని బాగా వాడేసుకుంటోంది. ఎంత‌గా అంటే.. ఈమె ఏ ప్రొడ‌క్ట్ రివ్యూ ఇచ్చినా అది సూప‌ర్ హిట్ అయిపోతుంది. అయితే ఒక ప్రొడ‌క్ట్ గురించి వివ‌రించాలంటే చెప్పేవారికే కాదు వినేవారికి కూడా ఓపిక ఉండాలి. చెప్పిన సోదే మ‌ళ్లీ మ‌ళ్లీ అటు ఇటు తిప్పి చెప్తే వినేవారికి విసుగుపుడుతుంది. అందుకే చెంగ్ త‌న ఫాలోవ‌ర్స్‌కి అలాంటి చిరాకు క‌లిగించ‌కుండా కేవ‌లం మూడంటే మూడు క్ష‌ణాల్లో ప్రొడ‌క్ట్‌కు రివ్యూ ఇచ్చేస్తుంది. ఇలా ఎన్నో ప్రొడ‌క్టుల‌కు రివ్యూలు ఇచ్చి ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.120 కోట్లు వెన‌కేసుకుంది.

చెంగ్‌కు డూయిన్ యాప్‌లో 5 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇత‌ర ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల లాగా ప్రొడ‌క్ట్ గురించి ఒక గంట పాటు సోది చెప్తూ వివ‌రించ‌కుండా ఒక టెక్నిక్ ఫాలో అవుతుంది. వీడియో మొద‌లుపెట్ట‌గానే త‌న అసిస్టెంట్ ఒక ఆరెంజ్ బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్‌లో చెంగ్ రివ్యూ ఇవ్వాల‌నుకున్న ప్రొడ‌క్ట్ ఉంటుంది. ఆ ప్రొడ‌క్ట్ బాగుందో లేదో చెప్ప‌డానికి చెంగ్ కేవ‌లం మూడు సెకెన్ల స‌మ‌యం మాత్ర‌మే తీసుకుంటుంది. ప్రొడ‌క్ట్‌ను కెమెరాలో బాగా క‌నిపించేలా క్లియ‌ర్‌గా చూపించాక దాని ధ‌ర చెప్పేస్తుంది. అంతే.. ఇంత‌కుమించి ఇంకేమీ చెప్ప‌దు. అది కొనాల‌నుకుంటే ఫాలోవ‌ర్లు కొనుక్కోవ‌చ్చు. లేదంటే లేదు. అంతేకానీ త‌ప్ప‌కుండా కొనుక్కోండి అని అన‌వ‌స‌ర ప్ర‌మోష‌న్లు మాత్రం చెంగ్ చేయ‌దు.

అంతేకాదు.. చెంగ్ ఏ ప్రొడ‌క్ట్‌కి రివ్యూ ఇచ్చినా కూడా ఆ ప్రొడ‌క్ట్ సేల్స్ దూసుకెళ్తాయ‌ట‌. చెంగ్ ప్రొడ‌క్ట్ గురించి చెప్ప‌డం ఆల‌స్యం దానిని కొనుగోలు చేసేందుకు క‌స్ట‌మ‌ర్లు క్యూ క‌డ‌తారు. అలాగ‌ని చెంగ్ మోసపూరిత‌మైన రివ్యూలు ఇవ్వ‌దు. ప్రేక్ష‌కుల బ‌డ్జెట్‌ను బ‌ట్టే ప్రొడ‌క్ట్ రివ్యూలు ఇస్తుంది. అంతేకానీ మ‌రీ ఖ‌రీదైన వాటి గురించి గొప్ప‌లు చెప్తూ కొంద‌రు ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల మాదిరి మోసాల‌కు పాల్ప‌డ‌దు. అందుకే ఆమెకు ఆ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల అవ‌స‌రం మ‌న‌కు కూడా ఉంది. మ‌న దేశంలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు ఉన్నారు. కానీ వారికి ఎలా డ‌బ్బులు సంపాదించాలా అనేదానిపైనే ఫోక‌స్ ఉంటుంది కానీ ఫాలోవ‌ర్లకు ఆ ప్రొడ‌క్ట్ అవ‌స‌రం ఉంటుందా లేదా అనే ధ్యాస ఉండ‌దు. అఫ్‌కోర్స్.. నిజాయ‌తీగా ప్రొడ‌క్టుల‌కు రివ్యూలు ఇచ్చేవారు కూడా ఉన్నార‌నుకోండి. చెంగ్‌ని చూసాక మీకు కూడా ఇలాంటి ఆలోచ‌నే వ‌చ్చిందా? వ‌స్తే మంచిదే. కాక‌పోతే బాగా రీసెర్చ్ చేసి మీరు కూడా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా మారిపోవ‌చ్చు.