నెల‌లో పెళ్లి.. శ‌వమై వ‌చ్చిన పోలీస్ కానిస్టేబుల్

Uttar pradesh: నెల రోజుల్లో వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. పెళ్లి త‌ర్వాత త‌మ జీవితం ఎలా ఉండాలో అని క‌ల‌లు కంటున్న స‌మ‌యంలో కాబోయేవాడు శ‌వ‌మై ఇంటికి వ‌చ్చాడు. ఓ ఆడ‌పిల్ల‌కు ఇంతకు మించిన శోకం మ‌రొక‌టి ఉండ‌దేమో. పై ఫోటోలో క‌నిపిస్తున్న యువ‌తిని చూసారా? వ‌స్తాడు మ‌నువాడ‌తాడు అనుకున్నవాడు శ‌వమై క‌ళ్ల ముందు అలా ఉంటే ఆమె కుప్ప‌కూలిపోయి దీన‌స్థితిలో అలా చూస్తూ ఉండిపోయింది. ఈ దృశ్యం చూసి అక్క‌డివారి క‌ళ్లు చెమ‌ర్చాయి.

ఏం జ‌రిగింది?

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన స‌చిన్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. ఓ మ‌ర్డ‌ర్ కేసులో భాగంగా అశోక్ యాద‌వ్ అనే క్రిమిన‌ల్‌ను వెంటాడుతున్న స‌మ‌యంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో అశోక్ త‌ప్పించుకున్నాడు కానీ స‌చిన్‌కు బుల్లెట్లు త‌గిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యం తెలిసి స‌చిన కుటుంబం క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది. సచిన్‌కు 2024 జ‌న‌వ‌రిలో వివాహం జ‌ర‌గాల్సి ఉంది. త‌న‌కు కాబోయేవాడు ఇక లేడ‌ని తెలుసుకున్న ఆ యువ‌తి పిచ్చిదానిలా అలా అత‌ని శ‌వం వైపు చూస్తూ కూర్చుండిపోయింది. త‌న కుమారుడి చావుకు కార‌ణం అయిన‌వారికి కూడా ఇదే గ‌తి ప‌ట్టాల‌ని స‌చిన్ త‌ల్లిదండ్రులు పోలీసుల‌తో వాద‌న‌కు దిగారు. వారిని ఓద‌ర్చాడం ఎవ్వ‌రి త‌రం కాలేదు.

2017 నుంచి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో క్రిమినల్స్‌కు పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 16 మంది పోలీసుల అమ‌రుల‌య్యారు. మ‌రో 1500 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 2017 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ల సంఖ్య 11,808.