న‌చ్చిన ఫుడ్ కోసం ఏకంగా రూ.32 లక్ష‌లు ఖ‌ర్చు చేసిన యువ‌తి

Food: కొంద‌రికి కొత్త బ‌ట్ట‌లు కొనుక్కోవాలంటే ఇష్టం. ఇంకొంద‌రికి గ్యాడ్జెట్ల క‌లెక్ష‌న్ అంటే ఇష్టం. వీటి కోసం ఎంత డ‌బ్బైనా ఖ‌ర్చు చేస్తారు. అదే విధంగా ఎంతైనా ఖ‌ర్చు పెట్టి తినే ఫుడీస్ కూడా ఉంటారు. వీరు ఏది ప‌డితే అది తిన‌రు. న‌చ్చిన‌వే తింటారు.. వాటి కోసం ఎంత దూర‌మైనా వెళ్తారు ఎంతైనా ఖ‌ర్చు చేస్తారు కూడా. ఎంత ఖ‌ర్చు చేసినప్ప‌టికీ న‌చ్చిన ఫుడ్ కోసం ఎవ‌రైనా ఏకంగా రూ.32 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడ‌తారా? కానీ చైనాకు చెందిన కాంగ్ అనే యువ‌తి ఖ‌ర్చు చేసింది.

కాంగ్ ఒక పెద్ద ఫుడీ. ఆమెకు చైనాలోని హైదిలావ్ అనే రెస్టారెంట్‌లో చేసే ఓ డిష్ అంటే ప్రాణం అట‌. ఆ డిష్ పేరు చెప్ప‌లేదు కానీ ఈ వంట‌కాన్ని క‌స్ట‌మ‌ర్లే ప్రిపేర్ చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఈ డిష్ కోసం కాంగ్ 2,70,000 యువాన్లు అంటే మ‌న క‌రెన్సీలో రూ.32 ల‌క్షలు ఖ‌ర్చు చేసింది. అయితే ఇది ఒక రోజు ఖ‌ర్చు కాదులెండి. తొమ్మిదేళ్ల‌లో 627 సార్లు ఈ డిష్ ఆర్డ‌ర్ పెట్ట‌డం వ‌ల్ల అయిన ఖ‌ర్చు అది. కాంగ్‌కి మేకప్, కాస్మెటిక్స్, దుస్తులు, ట్రిప్స్ ఇలా వేటిపై కూడా ఇంట్రెస్ట్ లేద‌ట‌. అందుకే కేవ‌లం త‌న‌కు న‌చ్చిన ఆహారం తినేందుకే డ‌బ్బులు సేవ్ చేసుకుంటున్నాన‌ని అంటోంది.