Gold Prices: తులం లక్ష దాటనుందా?
Gold Prices: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం లక్ష దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్ గ్రామ్ గోల్డ్‌తోనే సరిపెట్టుకునే పరిస్థితులు రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ డొనాల్డ్ ట్రంప్ వస్తే బంగారం రేటు పెరుగుతుందని భయపడుతున్నారు. అందుకే చైనా కూడా అక్కడ బంగారం నిల్వలను పెంచుకుంటోంది.
బంగారం ధర రాకెట్ వేగంతో పెరిగిపోతోంది. ధరల పరుగు పందెంలా దూసుకుపోతోంది. రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బులియన్ మార్కెట్ స్టాక్ మార్కెట్‌తో పోటీ పడుతోంది. పెరగడమే తప్ప కనకం తరగనంటోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. సామన్యులకు అందనంత దూరంతో ఆల్‌టైం రికార్డులను టచ్ చేస్తోంది. దాంతో బంగారం కొనాలంటేనే ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తోంది.
ఇంట్లో పెళ్లిళ్లు పెట్టుకున్నవారు గోల్డ్ షాపు వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. రానున్న కాలంలో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు కాస్త బంగారం కొని దాచి పెట్టుకుందాం అంటేనే కంగారుపడుతున్నారు. అంతేకాదు.. రాకెట్‌గా దూసుకుపోతున్న బంగారం.. రానున్న కాలంలో లక్ష రూపాయలను టచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో జనాలు బంగారం కొనాలంటేనే మరింత భయపడుతున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో కొంత నేల చూపులు చూసిన పసిడి.. ఏప్రిల్ 1 నుంచే చుక్కలు చూపించింది. తులం బంగారం ఏకంగా రూ.70,000లను క్రాస్ చేసింది. హైదరాబాద్, విజయవాడలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వరకు ఉంటే 24 క్యారెట్ల గోల్డ్ మాత్రం రూ.69,530 పలుకుతోంది. ఒక్క రోజులోనే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.850 పెరిగితే.. 24 క్యారెట్ల పసిడి మాత్రం ఏకంగా రూ. 930 పెరిగింది. పన్నులన్నీ కలుపుకుంటే తులం బంగారం ధర రూ. 70,830 ఉంది.
ఒక్కరోజులోనే ఇలా పెరిగితే.. రానున్న రోజుల్లో బంగారం కొనాలంటేనే ఆమడ దూరం ఉండాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ. 69,380కి చేరింది. దీనికి చార్జీలన్నీ యాడ్ చేస్తే రూ.70,830 ఉంది. ఒక్కరోజులోనే రూ.930 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది.