భర్తకు చాయ్.. భార్యకు పాలు.. ఇరుక్కున్న పోలీసులు
Viral News: ఈ మధ్యకాలంలో మరీ చిన్న చిన్న గొడవలకు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి గొడవల కారణంగా పాపం వారి వ్యక్తిగత జీవితాల్లో పోలీసులు కలగజేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజా ఘటనలో చాయ్, పాల గొడవ కారణంగా ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి గ్రామంలో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ఆ అమ్మాయి ఇంట్లో అందరూ పాలే తాగుతారు. ఎవ్వరూ టీలు కాఫీలు తాగరు. మరో పక్క ఆ వ్యక్తి ఆఫీస్‌కి వెళ్లి వస్తుంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు చాయ్ తాగుతుంటాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కప్పు చాయ్ కావాలని అడిగాడు. సరే అని చాయ్ చేసి ఇచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. భర్త చాయ్ తాగుతుంటే భార్య గ్లాసుడు పాలు తాగింది. దాంతో అతనికి కోపం వచ్చింది. నేను చాయ్ తాగుతుంటే నువ్వు పాలు తాగుతావేంటి. రేపటి నుంచి నువ్వు కూడా చాయే తాగు. పాలు ఖరీదెక్కువ అని తిట్టాడు. దాంతో ఆమెకు కోపం వచ్చింది. మా ఇంట్లో ఎవ్వరూ టీ, కాఫీ తాగరు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నేను పాలే తాగుతాను అని ముఖం మీదే చెప్పేసింది.
దాంతో భర్తకు కోపం వచ్చి భార్యను తిట్టాడు. ఆమె కూడా ఏమాత్రం తగ్గలేదు. వీరిద్దరి గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వీరి కేసు విని పోలీసులు ఇదేం తలనొప్పిరా నాయనా అని తలపట్టుకున్నారు. ముందు వీరిద్దరినీ ఓ కౌన్సిలిర్ వద్దకి పంపగా.. అతను ఇద్దరితో మాట్లాడి మీరు మీ భార్యను టీ తాగు అని బలవంతం చేయకండి సర్.. మహా అంటే ఆవిడ ఒక గ్లాసు పాలు తాగుతారు. అందులో ఇబ్బంది ఏముంది చెప్పండి అని సర్దిచెప్పాడు. అతని మాటలు అర్థం చేసుకుని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోయారు.