నేను టికెట్ కొనుక్కుంటా.. ఉచిత ప్రయాణ పథకాన్ని ఈ అధికారిణి ఎందుకు వ్యతిరేకిస్తోంది?
Free Bus Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరు మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల బస్సుల్లో మహిళల ప్రయాణం ఒక్కసారిగా పెరిగిపోయింది. కొందరు మహిళలు ఈ ఉచిత పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం అసలు ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిపోయి ఎక్కే అవకాశం కూడా ఉండటంలేదని మండిపడుతున్నారు.
అయితే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వ అధికారిణి అయిన తస్లిమా వ్యతిరేకించారు. ఇలా వ్యతిరేకించిన తొలి ప్రభుత్వ అధికారిణి ఈమే. బస్సులో ఎక్కి టికెట్‌కు డబ్బులు ఇస్తుంటే వద్దు మేడం మీకు ఫ్రీ అని చెప్పి ఉచితంగా టికెట్ ఇచ్చారట. దీని పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. అందరు మహిళల్లో సగం మందికి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కునే స్థోమత ఉండే ఉంటుంది. అలాంటప్పుడు వారికి ఉచిత ప్రయాణం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ టికెట్ కొనుక్కునే స్థోమత లేనివారికి ఈ పథకాన్ని పెట్టి ఉంటే బాగుండేదని తస్లిమా అభిప్రాయపడుతున్నారు. ఉచితంగా వస్తే అన్నీ వాడుకునేవారు ఉన్న ఈ సమాజంలో ఈ పథకం వల్ల ఆర్టీసీ ఆదాయం పడిపోకుండా ఉంటే చాలని ఆమె అంటున్నారు.