Moon: మనకు ఒకడే చందమామ.. ఆ గ్రహాలకు వందల్లో ఉంటాడట.. అలా ఎందుకు?
Moon: భూమి అంటే గ్రహం.. సూర్యుడు అంటే నక్షత్రం.. మరి చంద్రుడు అంటే ఎవరు? ఇప్పటికీ చాలా మంది చంద్రుడు కూడా గ్రహమే అని చెప్పేవారున్నారు. నిజానికి చంద్రుడు గ్రహం కాదు నక్షత్రం కాదు. అదొక సాటిలైట్. అంటే ఉపగ్రహం. అయితే.. మనకు భూమి నుంచి చూస్తే ఒక చందమామే కనిపిస్తాడు. కానీ ఇతర గ్రహాలకు కొన్ని వందల చందమామలు కనిపిస్తాయట. అలా ఎందుకో తెలుసుకుందాం.
చంద్రుడు సహజంగా ఏర్పడిన ఉప గ్రహం. గ్రహాల చుట్టూ సహజంగానే తిరుగుతూ ఉంటుంది. సౌర కుటుంబం ఏర్పడినప్పుడే సహజంగా చంద్రుడు ఏర్పడతాడు. లేదా.. గ్రహానికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని బట్టి ఏర్పడతాడు.
గ్రహాలకు గురుత్వాకర్షణ శక్తి లేకపోతే చంద్రుడిని పట్టుకోలేదు. దీనినే హిల్ స్పియర్ రేడియస్ అంటారు. ఈ రేడియస్ అనేది గ్రహం ద్రవ్యరాశి (మాస్), ఆ గ్రహం సూర్యుడికి ఎంత దూరంలో ఉంది అనేదానిని బట్టి ఉంటుంది. కేవలం పెద్ద గ్రహాలకు మాత్రమే ఈ హిల్ స్పియర్ రేడియస్ శక్తి ఉంది. చిన్న గ్రహాలకు ఆ శక్తి ఉండదు కాబట్టే చంద్రుడిని అంటిపెట్టుకోలేవు.
మరి మన భూమికి చంద్రుడు ఉన్నట్లు ఇతర గ్రహాలకు లేవా అంటే ఉన్నాయి. మార్స్ (అంగారకుడు)కి ఒకటి కాదు రెండు చంద్రుళ్లు ఉన్నాయి. ఒక దాని పేరు ఫోబోస్, రెండో దాని పేరు డీమోస్. మార్స్ గ్రహం రెండు చంద్రుళ్లను అంటిపెట్టుకోవడానికి కారణం గ్రహశకలాలు. ఇక మిగతా గ్రహాలైన జుపిటర్, నెప్ట్యూన్, ఉరానస్, సాటర్న్‌లకు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల చంద్రుళ్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రహాలు భూమి కంటే పెద్దవి వాటి హిల్ స్పియర్ రేడియస్ శక్తి కూడా భూమికంటే వంద రేట్లు ఎక్కువగా ఉంటుంది.
అయితే మన భూమి నుంచి కనిపించే చంద్రుడు ఎలా ఏర్పాడ్డాడు అనే దానికి మరో ఆసక్తికరమైన కథనం ఉంది. అదేంటంటే.. భూమి మార్స్ సైజంత ఉండే వస్తువుని ఢీకొనడం వల్ల ఒక ముక్క ఏర్పడిందని.. ఆ ముక్కే ఇప్పుడు మనం చూస్తున్న చందమామ అని కూడా శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఈ అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.