Kiran Gems: ఉద్యోగులను వెకేషన్‌కు పంపించిన కంపెనీ.. ఎందుకో తెలుసా?
Kiran Gems: కిరణ్ జెమ్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ డైమండ్స్ తయారీ కంపెనీ. ఈ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులను పది రోజుల పాటు విహారయాత్రకు పంపిందట. ఆగస్ట్ 17 నుంచి 27 వరకు కంపెనీని మూసేస్తున్నామని చెప్పి తమ 50 వేల ఉద్యోగులను విహారయాత్రకు పంపించింది. ఇలా ఎందుకు చేసిందంటే.. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ఉన్న డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ లెవెల్స్‌ని మేనేజ్ చేయడం కోసం ఓ పది రోజుల పాటు కంపెనీని మూసేయాలని కిరణ్ జెమ్స్ సంస్థ నిర్ణయించుకుంది.
ఇలా పది రోజుల పాటు కంపెనీని షట్‌డౌన్ చేయడం అనేది కిరణ్ జెమ్స్ చరిత్రలోనే మొదటిసారి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పాలిష్డ్ వజ్రాలకు ఉన్న గిరాకీ తగ్గిపోయింది. ధరలు లేవు. అమెరికా ఆంక్షలు, రష్యా వజ్రాలపై G-7 బ్యాన్ పరిస్థితిని మరింత చేజారిపోయేలా చేసాయి. డిమాండ్‌ని పెంచడానికి ప్రొడక్షన్ లెవెల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కిరణ్ జెమ్స్ ఛైర్మన్ వల్లభ్‌భాయ్ లఖానీ తెలిపారు. సప్లైని కంట్రోల్ చేస్తే ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. కిరణ్ జెమ్స్ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.17000 కోట్లు. ఈ కంపెనీ ఎక్కువగా డి బీర్స్ అనే సంస్థ నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తుంది. అయితే తమ కంపెనీలో పనిచేసే వర్కర్లకు పరిహారం కూడా చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది.