France: విమానంలో లేని ఆ 27 మంది భార‌తీయులు.. వారు ఏమైన‌ట్లు?

France: ఇటీవ‌ల దాదాపు 300 మంది భార‌తీయుల‌ను అక్ర‌మంగా నిక‌రాగ్వా త‌ర‌లిస్తున్నార‌ని స‌మాచారం రావ‌డంతో విమానాన్ని పారిస్‌లో నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు వారిని తమ ఆధీనంలో పెట్టుకున్న ఫ్రాన్స్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు.. నిన్న అదే విమానాన్ని మ‌ళ్లీ ఇండియాకు పంపించేసారు. ఈరోజు ఉద‌యం ఆ విమానం ముంబైలో ల్యాండ్ అయ్యింది. అయితే.. ప్ర‌యాణికుల్లో 27 మంది మిస్స‌య్యారు.

వారంతా ఏమ‌య్యారా అని అధికారులు ఆరా తీయ‌గా.. వెన‌క్కి పంపించేస్తారేమో అన్న భ‌యంతో ముందే అసైలంకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అసైలం అంటే వారికి భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ లేద‌ని కోరుతూ త‌మ దేశంలో ఉండేందుకు అనుమ‌తి తీసుకోవ‌డం. ఇలా అనుమ‌తి తీసుకున్నవారిలో 27 మంది భార‌తీయులు ఉన్నారు. వారిలో 20 మంది పెద్ద‌వాళ్లు, ఐదుగురు మైన‌ర్లు ఉన్నారు.

మిగ‌తా ఇద్ద‌రు అనుమానితులుగా ఉన్నారు. అయితే విచార‌ణ‌లో విమానంలో ఉన్న ప్ర‌యాణికులంతా త‌మ ఇష్ట ప్ర‌కార‌మే విమానంలోకి ఎక్కార‌ని ఎక్క‌డా మాన‌వ అక్ర‌మ ర‌వాణా అంశంలేద‌ని ఫ్రాన్స్ పోలీసుల‌కు క్లారిటీ రావ‌డంతో ఆ ఇద్ద‌రిని కూడా త్వర‌లో ఇండియాకు పంప‌నున్నారు.

జ‌రిగింది ఇది

గ‌త శుక్ర‌వారం దుబాయ్ విమానాశ్ర‌యం నుంచి నిక‌రాగువాకు వెళ్లాల్సిన A340 విమానంలో 303 మంది ప్రయాణికులు ఎక్కారు. వీరిని బ‌ల‌వంతంగా ఎక్కించి అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ట్లు ఫ్రాన్స్ అధికారుల‌కు స‌మాచారం అందింది. దాంతో విమానం పారిస్‌లోని వాట్రీ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అవ్వ‌గానే అంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ 303 మందిలో ఇద్ద‌రిపై అనుమానంతో వారిని అరెస్ట్ చేసి విచారించారు. అందరి ఐడీలు డాక్యుమెంట్లు ప‌రిశీలించాక అంతా క్లియ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టికీ నిక‌రాగువాకు కాకుండా మ‌ళ్లీ ఇండియాకే పంపించేసారు.