Kerala: బంగారం, 17 ఎక‌రాల పొలం, BMW కారు క‌ట్నంగా అడిగినందుకే ఆమె చ‌నిపోయిందా?

Kerala: కేర‌ళ వైద్యురాలి ఆత్మ‌హ‌త్య రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. కేర‌ళ‌కు చెందిన 26 ఏళ్ల ష‌హానా అనే యువ‌తి మొన్న రాత్రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణం ప్రేమించిన వాడు క‌ట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని అన‌డం అని పోలీసులు చెప్తున్నారు. 150 స‌వ‌ర్ల బంగారం, 17 ఎక‌రాల పొలం, ఒక కారు క‌ట్నంగా ఇస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని లేక‌పోతే లేద‌ని ష‌హానాను ఆమె ప్రియుడు బెదిరించాడు.

ష‌హానా త‌న త‌ల్లి ఇద్ద‌రు తోబుట్టువుల‌తో క‌లిసి కేర‌ళ‌లోని తిరువనంత‌పురంలో నివ‌సిస్తోంది. స్థానిక ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ష‌హానా తండ్రి గ‌ల్ఫ్ దేశంలో ఉద్యోగానికి వెళ్లి రెండేళ్ల క్రిత‌మే చ‌నిపోయాడు. ఈ నేప‌థ్యంలో కుటుంబ బాధ్య‌త‌ను ష‌హానా తీసుకుంది. ఇదే కాలేజీలో వైద్యుడిగా ప‌నిచేస్తున్న రువైస్‌ను ష‌హానా ప్రేమించింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని కూడా అనుకున్నారు.

ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్న విష‌యం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. అయితే రువైస్ కుటుంబీకులు మాత్రం అడిగినంత క‌ట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటాం అన్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఇంట్లో వారిని ఒప్పించి న‌చ్చజెప్పి పెళ్లి చేసుకోవాల్సిన రువైస్ వారితో పాటు క‌ట్నం కావాల‌ని డిమాండ్ చేయ‌డంతో ష‌హానా షాకైంది. ఆ బాధ‌లో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. చ‌నిపోవ‌డానికి ముందు అంద‌రికీ డ‌బ్బే కావాలి అని ఓ పేప‌ర్‌లో రాసి పెట్టి మ‌రీ చ‌నిపోవ‌డంతో పోలీసులు రువైస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.