Israel Palestine War: ఏం జ‌రిగింది.. ఏం జరుగుతోంది..!?

ఇజ్రాయెల్ పాలెస్తైన్ ప్రాంతాల‌ (israel palestine war) మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం ఉంది. ఈ వైరం ఇప్ప‌టిది కాదు మొద‌టి ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో చోటుచేసుకున్న ప‌రిణామాల వ‌ల్లే ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు కొట్టుకుని చ‌స్తున్నాయి. తాజా ఘ‌ట‌న‌లో ఇజ్రాయెల్‌ని రెచ్చ‌గొట్టింది పాలెస్తైనే. పాలెస్తీనాలోని గాజా నుంచి దాదాపు 5000 రాకెట్ల‌తో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

చరిత్ర‌లోకి వెళ్తే..

మొద‌టి ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత బ్రిట‌న్ (britain)పాలెస్తైన్ అలియాస్ పాలెస్తీనాను (palestine) ఆక్ర‌మించుకుంది. పాలెస్తీనాలో అర‌బ్‌లు (arab) ఎక్కువ‌గా ఉండ‌గా.. జ్యూస్ (jews) మ‌త‌స్థులు మైనారిటీలుగా ఉండేవారు. జ్యూస్ ప్ర‌జ‌లు మైనారిటీలు కాబ‌ట్టి వారిని అలా వ‌దిలేయ‌కుండా ఒక ప్ర‌దేశం వారి కోసం ఏర్పాటుచేస్తే బాగుంటుంద‌ని ప్ర‌పంచ దేశాలు బ్రిటన్‌కు చెప్పాయి. కానీ ఇది జ్యూస్, అర‌బ్ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేదు. ఎందుకంటే ఈ రెండు వ‌ర్గాల‌కు చెందిన‌వారికి ఒకే నేల‌పై ఉండ‌టం కావాలి.

యూర‌ప్‌లో కొన్ని ప‌రిణామాల వ‌ల్ల జ్యూస్ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండాపోతోంద‌ని 1920, 1940ల్లో వారు పాలెస్తీనాలో స్థిర‌ప‌డటం మొద‌లుపెట్టారు. అయితే పాలెస్తీనా అనేది ఎవ‌రి సొత్తు అనేదానిపై అర‌బ్, జ్యూస్ ప్ర‌జ‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. 1947 ఐక్య‌రాజ్య స‌మితి ఈ రెండు వ‌ర్గాల‌కు రెండు భాగాలుగా నేల‌ను విభ‌జించి ఇవ్వాల‌నుకున్నాయి. ఇందుకు కానీ అర‌బ్ దేశాలు ఒప్పుకోలేదు. దాంతో 1948లో ఇజ్రాయెల్ స్వ‌తంత్ర కొత్త‌ దేశంగా ప్ర‌క‌టించుకుంది. ఇక్క‌డి నుంచి యుద్ధం మొద‌లైంది. ఎంద‌రో అర‌బ్ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు నేల‌ను వ‌దిలి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. (israel palestine war)

యుద్ధం

అలా అప్ప‌టినుంచి ఇజ్రాయెల్, పాలెస్తీనాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం న‌డుస్తూనే ఉంది. 1987లో హ‌మ‌స్ (hamas) పేరుతో పాలెస్తీనా ప్ర‌జ‌లు ఒక గ్రూపును త‌యారుచేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై రాకెట్ల‌తో మెరుపు దాడుల‌కు పాల్ప‌డింది కూడా ఈ హ‌మ‌స్ సంస్థే. 2005లో ఇజ్రాయెల్ గాజాలోని త‌మ సైనికుల‌ను వెన‌క్కి పిలిపించుకుంది. దాంతో ఈ గాజా పాలెస్తీనా ప్ర‌భుత్వం కంట్రోల్‌లోకి వ‌చ్చింది. 2006లో హ‌మ‌స్ సంస్థ పాలెస్తీనాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలిచింది. అయిన‌ప్ప‌టికీ హ‌మ‌స్ సంస్థ‌ను ఇజ్రాయెల్ ఉగ్ర‌వాద సంస్థ‌గా ముద్రించేసింది. 2006లో హ‌మ‌స్ తీవ్ర‌వాదులు ఇజ్రాయెల్‌కు చెందిన సైనికుడు గిలాద్ ష‌లిత్‌ను కిడ్నాప్ చేసారు. దాంతో ఇజ్రాయెల్ గాజాపై మెరుపు దాడులు చేసింది. ఖైదీల ఎక్స్‌చేంజ్‌లో భాగంగా గిలాద్ ష‌లిత్ ఐదేళ్ల త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చాడు.

2007లో జ‌రిగిన చిన్న పాటి యుద్ధంతో హ‌మ‌స్ సంస్థ గాజాను త‌మ అదుపులోకి తీసుకుంది. వెస్ట్ బ్యాంక్‌ని కంట్రోల్ చేస్తున్న పాలెస్తీనా అధ్య‌క్షుడు మ‌హ‌మూద్ అబ్బాస్‌కు స‌పోర్ట్ చేస్తున్న‌వారిని గెంటేసారు. 2012లో ఇజ్రాయెల్ హ‌మ‌స్ మిలిట‌రీ సంస్థ లీడ‌ర్‌ను హ‌తం చేసింది. దాంతో దాదాపు ఎనిమిది రోజుల పాటు ఈ రెండు ప్రాంతాల మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌రిగింది. త‌మ లీడ‌ర్‌ను చంపినందుకుగానూ 2014లో హ‌మ‌స్ తీవ్ర‌వాదులు ఇజ్రాయెల్‌కు చెందిన ముగ్గురు టీనేజ్ పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి చంపేసారు. దాంతో మ‌ళ్లీ ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఏడు వారాల పాటు దాడులు జ‌రిగాయి. వంద‌లాది మంది ఇజ్రాయెల్, పాలెస్తీనా వాసులు చ‌నిపోయారు. (israel palestine war)

2021లో ఇజ్రాయ‌ల్ రాజ‌ధాని జెరూస‌లెంలో దాడులు జ‌రిగాయి. హ‌మ‌స్ గాజాపై రాకెట్ల‌తో దాడి చేస్తే.. ఇజ్రాయెల్ మెరుపుదాడుల‌తో బ‌దులిచ్చింది. ఇలా ప్ర‌తి సంవ‌త్స‌రం ఏదో ఒక దాడి జ‌రుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా జ‌రిగిన దాడిలో ఏకంగా 5000 రాకెట్ల‌ను ఉప‌యోగించారు. దాంతో ఇజ్రాయెల్ మేం యుద్ధానికి సిద్ధం అని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం తూర్పు జెరూస‌లెం, గాజా ప్రాంతాలు ఇజ్రాయెల్ స్వాధీనంలో ఉన్నాయి. వీటిని త‌మ ప్రాంతంలో అంత‌ర్భాగం చేసుకునేందుకు పాలెస్తీనా దాడుల‌కు పాల్ప‌డుతోంది.

చ‌ర్చ‌లు విఫలం

ఎలాగైనా పాలెస్తీనా ఇజ్రాయెల్ మ‌ధ్య శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ఏర్పాటుచేయాల‌న్న ఉద్దేశంతో 2000లో క్యాంప్ డేవిడ్ పేరుతో ఒక స‌మ్మిట్‌ను ఏర్పాటుచేసారు. కానీ ఎలాంటి ఒప్పందం జ‌ర‌గ‌కుండానే ఈ సమ్మిట్ మూత‌పడింది. అప్ప‌టినుంచి ఇరు ప్రాంతాల మ‌ధ్య ర‌చ్చ మ‌రింత పెరిగింది.