జంటల మధ్య ఎంత వయసు వ్యత్యాసం ఉండాలి? ఎలాంటి వారికి సమస్యలు వస్తాయి?
Relationship: మన భారతీయ సంప్రదాయంలో అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలి. అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఒక నెల ఎక్కువ ఉన్నా కూడా పెళ్లిళ్లు చేయరు. అయితే ఇప్పుడు ప్రేమించుకోవడాలు, లివిన్ రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వయసును కూడా చూడటం లేదు. వయసు చిన్నవారైనా పెద్దవారైనా ఇలా ఎవర్ని పడితే వారిని ప్రేమించేస్తున్నారు పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు. అలాగని ఇది తప్పు అని చెప్పడంలేదు. కాకపోతే జంటల మధ్య ఒక వయసు వ్యత్యాసం అనేది ఉండాలట.
ఒక అమ్మాయి అబ్బాయి మధ్య వయసు పదేళ్ల వ్యత్యాసం ఉంటే కచ్చితంగా ఆ పెళ్లి పెటాకులు అవుతుందని జర్నల్ ఆఫ్ పబ్లిక్ ఎకనామిక్స్‌లో ప్రచురించబడింది. ఎక్కువ వయసు వ్యత్యాసం ఉన్నవారి కంటే తక్కువ వయసు వ్యత్యాసం ఉన్న వారి దాంపత్య జీవితం సాఫీగా ఉంటోందట. అంటే ఒకటి నుంచి మూడేళ్ల వయసు గ్యాప్ ఉన్నవారితో పోలిస్తే నాలుగు నుంచి ఆరేళ్ల గ్యాప్ ఉన్నవారి మధ్య గొడవలు అవుతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే వయసు మధ్య గ్యాప్ ఎక్కువయ్యే కొద్ది దాంపత్య జీవితంలో సంతోషం తగ్గుతూ ఉంటుంది.
ఒకవేళ మీ పార్ట్నర్ వయసులో చాలా వ్యత్యాసం ఉన్నట్లు మీకు అనిపించినప్పటికీ వారిపై మీకు ఇష్టం ఉంటే నిర్మొహమాటంగా చెప్పండి. ప్రేమకు వయసులో సంబంధం లేదు. కాకపోతే ఏడడుగులు నడవాలనుకున్నప్పుడు లేదా వారితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాలను పరిశీలించుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అవేంటంటే..
మీకు భవిష్యత్తుపై ఉన్న లక్ష్యాలేంటి?
ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నాయా?
మీ విలువలు మీ పార్ట్నర్ విలువలు ఒకేలా ఉన్నాయా?
మీరు రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్నారా?
భిన్నాభిప్రాయాలు ఉంటే తట్టుకుని నిలబడగలరా?
ఈ విషయాలను బాగా పరిశీలించుకుని ఓ మంచి నిర్ణయం తీసుకోండి.