Mouse Jiggling: ఉద్యోగాలు పోతాయ్.. అసలేంటీ మౌస్ జిగ్లింగ్?
Mouse Jiggling: స్కూల్, కాలేజ్‌లలో ప్రిన్సిపల్ రౌండ్స్‌కి వస్తున్నారని తెలిసి కొందరు టీచర్లు ఎలాగైతే పిల్లలకు చాలా బాగా పాఠాలు చెప్తున్నట్లు తెగ నటిస్తుంటారో.. ఉద్యోగాల్లో బాస్ చూస్తున్నారో.. మేనేజర్లు చూస్తున్నారనో ఉద్యోగులు కూడా పని ఉన్నా లేకపోయినా మౌస్‌ను పదే పదే కదుపుతూ తెగ పనిచేసేస్తున్నట్లు నటిస్తుంటారు.
ఇక వర్క్ ఫ్రం హోం చేసేవారి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. పని చేయకుండా కర్సర్ మూవ్ అయ్యేలా కీబోర్డుపై ఏదన్నా వస్తువు పెట్టి ఆఫీస్ వాళ్లని బకరా చేస్తుంటారు. అలా మౌస్ కదపడాన్ని చూసి బాస్ మిమ్మల్ని తెగ మెచ్చేసుకుంటారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మౌస్‌ని అటు ఇటు కదిపితే మెచ్చుకోవడం మాట అటుంచండి.. ఉద్యోగాలే పోతాయ్. దీనినే మౌస్ జిగ్లింగ్ అంటారు.
ఇలాంటి ఘటనే ప్రముఖ అమెరికన్ బ్యాంకింగ్ కంపెనీ అయిన వెల్స్ ఫార్గోలో చోటుచేసుకుంది. వెల్స్ ఫార్గో సంస్థ కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. వారిలో కొందరు ఈ మౌస్ జిగ్లింగ్‌కి పాల్పడినట్లు బ్యాంక్ యాజమాన్యం కనుగొంది. వర్క్ చేయకుండా కేవలం ల్యాప్‌టాప్‌లో కర్సర్‌ని అటూ ఇటూ మూవ్ అయ్యేలా చేస్తున్నారని పసిగట్టి వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తీసేసింది.
అసలేంటీ మౌస్ జిగ్లర్స్?
మౌస్ జిగ్లర్ అనేది ఓ పరికరం. మనం కంప్యూటర్‌పై కానీ ల్యాప్‌టాప్‌పై కానీ కొద్ది సేపటి వరకు వర్క్ చేయకుండా ఉంటే అవి స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. అలా స్లీప్ మోడ్‌లోకి వెళ్లకుండా ఈ మౌస్ జిగ్లర్లను వాడతారు. వీటి వల్ల కంప్యూటర్, ల్యాప్‌టాప్ వర్కింగ్‌లో ఉన్నట్లు చూపిస్తాయి.
ఇంతకీ వెల్స్ ఫార్గో సంస్థ తమ ఉద్యోగులు మౌస్ జిగ్లర్లను వాడుతున్నారని ఎలా కనుక్కున్నారో తెలుసా? కొందరు ఉద్యోగులు వర్క్ చేస్తున్నట్లే అనిపిస్తున్నప్పటికీ వారికి మెసేజ్‌లు, కాల్స్ చేస్తుంటే అసలు రెస్పాండ్ అవ్వడం లేదట. వర్క్ చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందే ఉంటారు. అలాంటప్పుడు వచ్చే కాల్, మెసేజ్‌కి ఎందుకు రెస్పాండ్ అవ్వడంలేదు అని పరిశీలించగా ఈ మౌస్ జిగ్లర్ల వ్యవహారం బయటపడింది.