Children’s Day: ఈ స్కూల్‌లో పిల్ల‌ల‌కు ఫ్రెండ్స్ ఉండ‌కూడ‌దు..!

Children’s Day: ఈరోజు బాల‌ల దినోత్స‌వం. పిల్ల‌ల కోసం దేశంలోని దాదాపు అన్ని పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. వారికి మిఠాయిలు వంటివి పంచిపెడ‌తారు. మ‌న దేశంలో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ (jawaharlal nehru) పుట్టిన‌రోజుని బాల‌ల దినోత్స‌వంగా జ‌రుపుకుంటాం. ఇత‌ర దేశాల్లో మ‌న‌లాగా బాల‌ల దినోత్స‌వం జ‌రుపుకుంటారో లేదో తెలీదు కొన్ని పాఠ‌శాలల్లో పిల్ల‌ల‌కు వింత రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ఏంటో చూద్దాం.

ఫ్రెండ్స్ ఉండ‌కూడ‌దు

లండ‌న్‌లోని సెయింట్ థామ‌స్ పాఠ‌శాల త‌మ ద‌గ్గ‌ర చ‌దివే పిల్ల‌ల కోసం ఓ వింత రూల్ పెట్టింది. అదేంటంటే.. పిల్ల‌ల‌కు ఫ్రెండ్స్ ఉండ‌కూడ‌దు. ఎందుకంటే.. వారికి ఫ్రెండ్స్ ఉంటే ఒక‌వేళ వారిలో వారికి గొడ‌వ‌లు జ‌రిగితే తీవ్రంగా బాధ‌ప‌డ‌తార‌ని ఆ బాధ వారి మాన‌సిక ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని ఈ రూల్ పెట్టార‌ట‌. అయితే ఇదే పాఠ‌శాల‌లో బ్రిట‌న్ రాకుమారుడు విలియం కుమారుడు ప్రిన్స్ జార్జ్ చ‌దువుతున్నాడు. జార్జ్‌కి మాత్రం ఈ రూల్ వ‌ర్తించ‌ద‌ట‌.

మేక‌ప్ వేసుకుని రాకూడ‌దు

స్కూల్‌కి వెళ్లి చ‌దువుకునే ఆడ‌పిల్ల‌లు సాధార‌ణంగా కాస్త అందంగా త‌యారై వెళ్తుంటారు. కానీ జ‌పాన్ పాఠ‌శాల‌ల్లో మాత్రం అమ్మాయిలు ఎలాంటి మేక‌ప్ కానీ గోళ్ల‌కు నెయిల్ పాలిష్ కానీ వేసుకుని వెళ్ల‌కూడ‌దు. అంతేకాదు వారు చేతులు, కాళ్ల‌కు షేవింగ్ చేసుకుని రాకూడ‌దు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే చ‌దువుకునే వ‌య‌సులో వారి ఫోకస్ ఎలా చ‌దువుతున్నాం అనే దానిపైనే ఉండాలి కానీ ఎంత అందంగా ఉన్నాం అనే విష‌యంపై కాద‌ని అక్క‌డ ఇలాంటి రూల్ పెట్టారు. ఈ రూల్ కాస్త మంచిదే అనుకోండి..! (children’s day)

మూడుసార్లు మాత్రమే బాత్రూమ్‌కి వెళ్లాలి

ఇక ఈ స్కూల్‌లో అయితే మ‌రీ వింత రూల్ పెట్టుకున్నారు. పిల్ల‌లు రోజులో కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే బాత్రూమ్‌కి వెళ్లాల‌ట. ఇది చికాగోలోని ఎవ‌ర్‌గ్రీన్ పార్క్ హైస్కూల్‌లో ఉంది. ఈ రూల్ ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందంటే.. ఓసారి ఓ విద్యార్ధిని ఒక గంట‌లో రెండుసార్లు బాత్రూమ్‌కి వెళ్లింద‌ట‌. దాంతో ఆ స్కూల్‌లో ప‌నిచేస్తున్న టీచ‌ర్ క్లాసులు ఎగ్గొట్ట‌డానికే బాత్రూమ్ సాకు పెట్టి వెళ్తున్నార‌ని అనుకుంద‌ట‌. దాంతో ప్రిన్సిప‌ల్‌తో మాట్లాడి కేవ‌లం రోజులో మూడు సార్లు మాత్ర‌మే బాత్రూమ్‌కి పంపుతార‌ట‌.