Vizag: అదే జరిగి ఉంటే వైజాగ్ కనుమరుగైపోయేది
Vizag: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 25 ఫిషింగ్ బోట్లు దగ్ధమయ్యాయి. ఒక్కో బోటు విలువ రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీనిని బట్టి చూస్తే దాదాపు 5 నుంచి 6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే రాత్రి వేళల్లో కొందరు ఆకతాయిలు కావాలనే తమ బోట్లకు నిప్పు పెట్టారని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కాని జరగలేదు.
అదే జరిగి ఉంటే వైజాగ్ కనుమరుగైపోయేది
ఈ ఫిషింగ్ హార్బర్ పక్కనే HPCL ఆయిల్ రిఫైనరీ సంస్థ ఉంది. ఒక్క నిప్పు రవ్వ అటుగా వెళ్లి పడినా ఈపాటికి వైజాగ్ ప్రాంతమే కనుమరుగైపోయి ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా ఊహకు అందకుండాపోయేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టి మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. (vizag)
పార్టీ చేసుకుంటున్నారా?
తమకు అందిన సమాచారం మేరకు ఫిషింగ్ హార్బర్‌లోని ఓ బోటులో కొందరు వ్యక్తులు పార్టీ చేసుకుంటూ ఉన్నారని.. అదే సమయంలో వారు ఉన్న బోటులో మంటలు చెలరేగాయని పోలీసులు చెప్తున్నారు. దాంతో వారు భయపడి బోటుకు ఉన్న లంగర్ విప్పేసారని దాంతో బోటు కొంత దూరం వరకు వెళ్లి పక్కన ఉన్న ఇతర బోట్లకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. (vizag)