Viral News: కూలీ బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్లు!

West Bengal: కేంద్ర ప్రభుత్వం(Central Government) పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన ప్రతీసారి కొన్ని విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా చెత్తకుండీల్లో, రోడ్ల పక్కన నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. కొందరి బ్యాంకు ఖాతాల్లో కోట్ల కొద్దీ నగదు జమయ్యింది. ఇప్పుడు రూ. 2000 నోట్ల రద్దు ప్రకటించగానే మళ్లీ అలాంటి విచిత్రాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్‌లో ఓ దినసరి కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ. 100 కోట్లు(100 crores) జమయ్యాయి. అతనికి డబ్బులు జమ అయినట్లు కూడా తెలియదు. ఆ కూలీ ఇంటికి సైబర్ క్రైం పోలీసుల నుంచి నోటీసులు రావడంతో అసలు విషయం తెలిసింది. ‘నీ అకౌంట్‌లో రూ. 100 కోట్లు జమ అయ్యాయి.. అందుకు సంబంధించిన పత్రాలను ఈనెల 30వ తేదీలోగా తీసుకురావాలి’ అని నోటీసుల్లో సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేగంగాలోని వాసుదేవ్‌పూర్‌లో మహ్మద్ నసీరుల్లా అనే వ్యక్తికి ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో ఈ డబ్బు జమ అయింది. అతడు వ్యవసాయ కూలీ. తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలు అందరూ అతని సంపాదనపైనే ఆధారపడి ఉన్నారు. రోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కసారిగా అతని అకౌంట్‌లో 100 కోట్లు జమ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. నగదు జమకాక ముందు అతని అకౌంట్ లో కేవలం రూ. 17 మాత్రమే ఉంది. నిజంగానే అతని అకౌంట్ లో 100 కోట్లు ఉండటంతో అతనికి దిమ్మతిరిగిపోయింది. బ్యాంకును సంప్రదించగా సాంకేతికలోపం కావచ్చని తెలిపారు. దీనిపై సైబర్​ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.