యువకుడికి లింగ మార్పిడి చేసి.. తనతో పడుకోవాలంటూ తోటి విద్యార్థి బెదిరింపులు
Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిపై కోపంతో అతనికి మాయమాటలు చెప్పి లింగ మార్పిడి చికిత్స చేసేసారు. ఆ అబ్బాయి కళ్లు తెరిచి చూడగానే తాను అమ్మాయిగా మారిపోయానని తెలిసి కుమిలి కుమిలి ఏడ్చాడు. ముజఫర్‌నగర్‌లో ఉన్న స్థానిక మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న 20 ఏళ్ల ముజాహిద్‌కి అదే కాలేజీలో చదువుతున్న ఓం ప్రకాష్ అనే వ్యక్తితో ఎప్పటినుంచో వైరం ఉంది. ముజాహిద్‌ని ఓంప్రకాష్ ఎప్పుడూ బెదిరిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇతర విద్యార్థుల చేత ముజాహిద్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్య సమస్య ఉందని మంచి హాస్పిటల్‌లో సర్జరీ చేయిస్తామని మాయమాటలు చెప్పి నమ్మించారు.
అలా ముజాహిద్‌ను స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఓం ప్రకాష్ అక్కడి వైద్యులతో కుమ్మక్కై ముజాహిద్‌కు లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసేసాడు. ముజాహిద్ కళ్లు తెరవగానే ఇప్పుడు నువ్వు అబ్బాయివి కావు అమ్మాయివి. నిన్ను ఇంట్లో వాళ్లు కూడా రానివ్వరు. నువ్వు నాతోనే ఉండాలి నాతోనే పడుకోవాలి అంటూ ఓం ప్రకాష్ వెక్కిరించాడు. దాంతో ముజాహిద్ తన బంధువులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముందు ఓం ప్రకాష్‌ను ఆ తర్వాత చికిత్సకు సహకరించిన హాస్పిటల్ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.