రోడ్డుపై చచ్చి పడున్న జంతువులను తింటోంది.. ఎందుకో తెలుసా?
US: మనం వాహనాల్లో వెళ్తున్నప్పుడు కుక్కలు, పిల్లులు ప్రమాదాలకు గురై చనిపోయి కనిపిస్తుంటాయి. వాటిని చూసి అయ్యో పాపం అనుకోవడం తప్ప ఏమీ చేయలేం. మహా అయితే చెత్తవాళ్లను పిలిపించి డబ్బులిచ్చి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఏం చేస్తోందో తెలుసా? వాటిని ఏరుకుని వెళ్లి వండుకుని తింటుంది.
ఆ అమ్మాయి పేరు మాండర్స్ బార్నెట్. వయసు 32. తను రోడ్లపై, అడవుల్లో జీవిస్తూ ఉంటుంది. తనకు ఒక గుర్రం తోడు ఉంటుంది. ఆ గుర్రంపైనే వెళ్లి తనకు కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకుంటుంది. ఒకప్పుడు మాండర్స్ వైల్డ్ లైఫ్ టెక్నీషియన్‌గా పనిచేసేది. 2017లో అన్నీ వదిలేసి తన గుర్రంతో అడవుల్లో బతుకుతానంటూ వెళ్లిపోయింది. తాను ప్రయాణిస్తున్నప్పుడు రోడ్లపై ఏవైనా జంతువులు ప్రమాదానికి గురై రక్తపు మడుగుల్లో పడి ఉంటే వాటిని తీసుకెళ్లి ముక్కలుగా కోసి వండుకుని తింటుంది.
తను ఇలా చేయడానికి ఒక కారణం ఉందట. ఆ జంతువులు అలా చచ్చే వరకు బాధ నొప్పిని అనుభవించే కంటే తనకు ఆహారంగా మారితే బెటర్ కదా అని చెప్తోంది. అలాగని తను కావాలని ఏ ప్రాణికీ హాని తలపెట్టదు. తనకు రోడ్లపై చచ్చి పడి ఉన్న లేదా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జంతువులను మాత్రమే తింటుంది. తాను నాలుగేళ్లుగా ఇలా అడవుల్లో ఓ చిన్న గుడిసె వేసుకుని జీవిస్తున్నానని.. కావాల్సినవి ఎలాగోలా సమకూర్చుంటున్నానని తెలిపింది. మంచి ఉద్యోగం వదిలేసి ఇలా ఎందుకు అని అడిగితే.. తనకు ప్రకృతి మధ్య జీవించాలని ఉందని చెప్తోంది.