4 నెలలుగా మహిళ మంచం కిందే నివసించిన ఆగంతకుడు
ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. తన ఇంట్లో తన మంచం కిందే ఓ ఆగంతకుడు నాలుగు నెలలుగా నివసిస్తున్నాడని తెలుసుకుని షాకైంది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లైన ఓ మహిళ ఎక్కువ శాతం తన పిల్లల్ని తన తల్లి దగ్గరికి తీసుకెళ్లి అక్కడే సమయం గడుపుతోంది. అలా రోజుకు 12 గంటల పాటు పిల్లలతో కలిసి తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. అలా నాలుగు నెలలుగా వెళ్తోంది. ఓసారి మంచం కింద ఏవో శబ్దాలు వస్తుంటే ఏముందా అని చూసిందట. తీరా చూస్తే ఓ వ్యక్తి దాక్కుని ఉన్నాడు. దాంతో అరుచుకుంటూ ఇంటి బయటికి వెళ్లి రచ్చ చేసింది. ఇరుగు పొరుగు వారిని పిలిపించి పోలీసులకు సమాచారం అందించింది.
అతను ఎవరో కాదు.. కొన్ని నెలల క్రితం తన గార్డెన్‌ని శుభ్రం చేసేందుకు పిలిపించిన వర్కర్ అట. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు నెలలుగా ఆ వర్కర్ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. ఆమె లేని సమయంలో ఇల్లు వాడుకుంటూ ఆమె వచ్చేసరికి మంచం కింద దాక్కుంటున్నాడు. చాలా సార్లు మంచం కింద శబ్దాలు వచ్చేవని.. ఎలుకల వల్ల ఆ శబ్దం వస్తోందేమో అని పట్టించుకోలేదని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.