రష్యన్ అభ్యర్ధిని చితక్కొట్టిన ఉక్రెయిన్ మంత్రి
Turkey: ఉక్రెయిన్,(ukraine) రష్యా(russia) దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం ఉందన్న విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(vladimir putin)..ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడం, అక్కడి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేయడంతో ఆ దేశం రష్యాపై పీకలదాకా కోపం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ.. రష్యన్ అభ్యర్ధి కొట్టుకున్న ఘటన వైరల్‌గా మారింది. టర్కీ రాజధాని అంకారాలో 61వ బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ సభ్యులతో పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ర తన జాతీయ జెండాను పట్టుకుని నడుచుకంటూ వెళ్తుంటే.. పక్కనుంచి వచ్చిన రష్యన్ అభ్యర్ధి ఒకరు ఆ జెండాను చించేసాడు.
దాంతో ఆ ఎంపీకి ఒళ్లుమండి వెంబడించి మరీ కొట్టాడు. అలా వారిద్దరి మధ్య కొట్టాట జరిగింది. అక్కడే ఉన్న వారు గొడవ సర్దుమణిగేలా చేసారు. ఈ బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ అనేది ఉక్రెయిన్, రష్యా కలిసి 30 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసింది. ఇరు దేశాల మధ్య శాంతి, భద్రతలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈ కమిటీని ఏర్పాటుచేసారు. అయితే రెండు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది ఉక్రెయినే అని వాదనలు వినిపిస్తున్నాయి. పుతిన్‌ను చంపాలని ఉక్రెయిన్ కుట్ర పన్నుతోంది అని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలా ఇరు దేశాల అభ్యర్ధులు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.