UK: ఇండియ‌న్ టెకీల‌కు యూకే బ్యాడ్ న్యూస్

UK gives bad news for indian techies

UK: ఇత‌ర దేశాల‌కు చెందిన అధిక మంది ఉద్యోగులు యూకేకి వ‌స్తున్న నేప‌థ్యంలో ఆ దేశ ప్ర‌భుత్వం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. యూకే హోం సెక్ర‌ట‌రీ వెట్ కూప‌ర్ యూకేకి చెందిన చాలా మ‌టుకు టెక్నాల‌జీ, ఇంజినీరింగ్ కంపెనీలు ఇత‌ర దేశాలకు చెందిన‌వారినే నియ‌మించుకుంటున్నార‌ని అన్నారు. ఈ రంగాలు అంతర్జాతీయ స్కిల్డ్ వ‌ర్క‌ర్ల‌ను ఆకర్షించడానికి ప్రావీణ్య వర్కర్ వీసాలపై ఎందుకు ఎక్కువగా ఆధారపడుతున్నాయో తెలుసుకునేందుకు మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (MAC)ని సమీక్షించమని కూపర్ అభ్య‌ర్ధించారు.

ప్రధానంగా సమాచార సాంకేతికత, టెలీ కమ్యూనికేషన్స్, ఇంజినీరింగ్ రంగాలు ప్రావీణ్య వర్కర్ వీసాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. వారంతా వ‌చ్చి యూకేలో ప‌నిచేయ‌డం మెచ్చుకోద‌గ్గ విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ ప్రస్తుత స్థాయిలో అంతర్జాతీయ నియామ‌కాలు చాలా ఎక్కువగా ఉన్నాయ‌ని ఇది మ‌రింత‌ కొనసాగించడానికి సాధ్యం కాదని కూప‌ర్ అభిప్రాయ‌పడ్డారు. ఇలా ప‌క్క దేశాల‌కు చెందిన‌వారు యూకేకి వ‌చ్చి ఉద్యోగాలు చేస్తుంటే యూకేలో నైపుణ్యాల కొరత ఉంద‌న్న విష‌యాన్ని సూచిస్తోందని తెలిపారు.

యూకే ప్రభుత్వానికి వలసల సంఖ్యను తగ్గించి, ఇమ్మిగ్రేషన్ విధానాలను యూకే నైపుణ్య అవసరాలకు అనుగుణంగా చేయాలనే లక్ష్యం ఉంది. దీని ద్వారా దేశానికి ఉపయోగపడే సమానమైన విధానం సృష్టించాలని కూప‌ర్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో యూకేకు వీసా ద‌ర‌ఖాస్తులు బాగా త‌గ్గాయి. ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే కుటుంబ ఆధారిత ఆంక్షలు ప్రవేశపెట్టిన తర్వాత, విద్యార్థులు, ప్రావీణ్య కార్మికుల వీసా దరఖాస్తులలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. వలసదారుల వ‌ల్ల‌ యూకేకి అనేక ప్రయోజనాలు ఉన్నాయ‌ని కాక‌పోతే వాటిని క్రమబద్ధీకరించి సమానమైన విధానంలో అమలు చేస్తే ఇంకా మంచిద‌ని యూకే ప్రభుత్వం వెల్ల‌డించింది.

ఇప్పుడు యూకే తీసుకోబోతున్న ఈ నిర్ణ‌యంతో భార‌తీయ టెకీల‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా త‌ర్వాత భార‌త టెకీలు ఎక్కువ‌గా వెళ్లాల‌నుకునే దేశం యూకేనే. ఇప్పుడు యూకే విధించే ఆంక్ష‌ల వ‌ల్ల మ‌న టెకీలు అక్క‌డ ఉద్యోగాలు సంపాదించ‌డం మ‌రింత క‌ష్ట‌త‌రం అవుతుంది.