Air Bags: ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పసికందు మృతి
Air Bags: యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలు కూడా చాలానే చూసాం. కానీ భారత్‌లోనే తొలిసారి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయిన సంఘటన కేరళలో ఏర్పడింది.
కేరళకు చెందిన ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా.. ముందు సీటులో ఓ యువతి నెలల పసికందుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంది. కారు కొట్టక్కళ్ – పడపరంబు ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు మిగతా నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ ముందు సీటులో కూర్చున్న యువతి ఒడిలో ఉన్న పసికందు మాత్రం అక్కడికక్కడే చనిపోయింది. ఇందుకు కారణం కారు లారీని ఢీకొన్నప్పుడు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడమే. ఆ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో బిడ్డకు ఊపిరాడక చనిపోయింది. మిగతావారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డను కోల్పోయిన దుఖంలో ఆ యువతి స్పృహ కోల్పోవడంతో వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు.