Jharkhand: ఈ ప్రాంతంలో 2025వ సంవత్సరం నడుస్తోంది..!
Jharkhand: యావత్ ప్రపంచంలోని దేశాల్లో కాలమానం ప్రకారం తేదీలు, సమయాల్లో మార్పులు ఉంటాయి. కానీ సంవత్సరం మాత్రం ఒకటే. ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం 2023. ఇంకో పది రోజుల్లో 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. కానీ తైమరా వ్యాలీ అనే ప్రాంతం మాత్రం 2025లో ఉంది. ఈ వ్యాలీ ఎక్కడో లేదు. మన ఝార్ఖండ్‌లోనే ఉంది. ఈ వ్యాలీ విశేషాలేంటో తెలుసుకుందాం.
ఝార్ఖండ్‌లో ఉన్న రాంచీ – జంషడ్‌పూర్ ప్రాంతాల మధ్యలో ఉంది ఈ తైమారా వ్యాలీ. తైమారా వ్యాలీ – రాంపూర్ మధ్యలో ఎవరైనా ప్రయాణిస్తున్నప్పుడు వారి ఫోన్లలో తేదీ, సంవత్సరం, సమయం మారిపోతాయట. ఇప్పుడు ఎవరైనా అక్కడ ప్రయాణిస్తుంటే వారి ఫోన్లలో సంవత్సరం 2025గా చూపిస్తుంది. ఈ వ్యాలీలో కాళీమాత, భజరంగ్ బలి ఆలయాలు తప్ప చూసేందుకు ఏమీ లేవు.
ఇక్కడ ఈ ఆలయాలు కట్టడానికి వెనుక కూడా ఓ కారణం ఉంది. ఓ మహిళ తెల్ల చీర కట్టుకుని ఎప్పుడూ రోడ్డు దాటుతున్నట్లు కనిపించేదట. ఆమె ఉన్నట్టుండి రోడ్డు మీదకి వచ్చేయడంతో డ్రైవర్లు అదుపు తప్పి రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు. అలా చాలా మంది చనిపోవడంతో ఈ కాళీ మాత, భజరంగ్ బలి ఆలయాలు నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు.
ఈ వ్యాలీలో అయస్కాంత శక్తులు ఉన్నాయని అందుకే సమయం, తేదీ, సంవత్సరంలో మార్పులు వస్తుంటాయని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తున్నామని రాంచీ యూనివర్సిటీ భౌగోళిక శాస్త్రవేత్త బచా రామ్ ఝా తెలిపారు.