Coromandel Express: ఇది మూడో ఘటన..!
Odisha: ఒడిశాలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు (train accident) ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 300లకు చేరుకుంది. 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడి దగ్గర్లోని హాస్పిట్సల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే.. ప్రమాదానికి గురైన రైళ్లలో ఒక గూడ్స్ రైలు, షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) గతంలోనూ రెండు సార్లు ప్రమాదాలకు గురైంది. అయినప్పటికీ రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మూడోసారి పెను ప్రమాదం చోటుచేసుకుంది.
2002, 2009, 2023లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) ప్రమాదాలకు గురైంది. 2002లో వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు మధ్య ప్రయాణిస్తూ నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పింది. చెన్నై వెళ్తున్న 8 కోచ్‌లు పట్టాలు తప్పి నుజ్జు నుజ్జయ్యాయి. కాకపోతే పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు కానీ దాదాపు 100 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఆ సమయంలో నెల్లూరులో ఉన్న రైల్వే ట్రాక్ సరైన స్థితిలో లేదని అన్నారు. 2009లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోనే ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పడంతో దాదాపు 16 మంది మృత్యువాతపడ్డారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో రైలు అతివేగంతో వెళ్తోంది. సరిగ్గా జైపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ దాటిన కాసేపటికే ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది.
ఇక మూడో ప్రమాదం కూడా నిన్న రాత్రి ఒడిశాలోనే చోటుచేసుకుంది. 2009లో ఎక్కడైతే ప్రమాదం చోటుచేసుకుందో ఆ ప్రమాద స్థలం నుంచి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో నిన్న రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) ప్రమాదానికి గురైంది. బహనగ బజార్ రైల్వే స్టేషన్ దగ్గర్లో పట్టాలు తప్పడంతో 11 బోగీలు, ఇంజిన్ గాల్లో ఎగిరిపడ్డాయి. ఇప్పటికైనా రైల్వే యంత్రాంగం ఈ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై ఓ కన్నేసి ఉంచితే మంచిది.