Love Story: పెళ్లి అనగానే ఎందుకు మారిపోయారో?
Hyderabad: ప్రేమలో ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం అంటారు (love story). పెళ్లి మాట ఎత్తగానే ఇంట్లో ఒప్పుకోవడంలేదు, అమ్మానాన్నలను కాదని రాలేను అన్న డైలాగులు వస్తాయి. ఈ మాట అమ్మాయిల విషయంలోనే ఎక్కువ అనుకుంటారు చాలా మంది. కానీ అలాంటి అబ్బాయిలు కూడా చాలానే ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎక్స్‌క్లూజివ్‌గా రాసిన లెటర్స్ ద్వారా ఈ న్యూస్ పబ్లిష్ చేయబడింది.
అబ్బాయి రాసిన స్టోరీ
హైదరాబాద్‌కు చెందిన అనిల్ (పేరు మార్చాం) అనే కుర్రాడు ఎస్సీ కులానికి చెందినవాడు. బాగా చదువుకుని పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇతనికి టిండర్ డేటింగ్ యాప్‌లో సంజన (పేరు మార్చాం) అమ్మాయి పరిచయం అయింది. ఆమెది బెంగళూరు. వాళ్ల కులం వేరు. అమ్మాయి మోజులో డేటింగ్ చేసి వదిలించుకుందాం అనుకున్నాడు. ఆలా ఇద్దరూ శారీరకంగా కలిసారు. అయితే సంజన తన జీవితంలో పడిన బాధలన్నీ అనిల్‌కి చెప్పుకోవడంతో అతనికి జాలేసింది.
తనకు ఇద్దరు అక్కలు ఉన్నారని, వారిని బాగా చదివించి గ్రాండ్‌గా పెళ్లిళ్లు చేసారని చెప్పింది. కానీ తనను మాత్రం భారంగా భావించి ఇంటర్ వరకు చదివించి గాలికి వదిలేసారని చెప్పింది. అయినా ఏదోలా డిప్లొమా చేసి ఆప్టోమెట్రిస్ట్‌గా పనిచేస్తున్నానని అనిల్‌కి చెప్పింది. అలా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టింది. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనిల్ ఇంట్లో చెప్పాక అతని తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. వారికి కోడలు మంచిదైతే చాలు అనిపించింది. అయితే సంజన ఇంట్లో విషయం చెప్తే వాళ్లది తక్కువ కులం అంటూ హేళన చేసారట. అయినా కూడా అనిలే ఎలాగోలా ప్రాథేయపడి ఒప్పించాడు.
పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాల కోసం అనిల్ సంజన ఇంటికి వెళ్లి మాట్లాడాలనుకున్నాడు. అప్పుడే సంజనలో వచ్చిన మార్పులను చూసి షాకయ్యాడు. అప్పటివరకు అమ్మానాన్నలు సరిగ్గా చూడటంలేదు.. నాకు నువ్వే దిక్కు అని ఏడ్చిన సంజన.. పెళ్లి అనగానే అమ్మానాన్నలు ఒప్పుకుంటేనే చేసుకుందాం అనేసింది. అనిల్ ఎంతో కష్టపడి వాళ్ల అమ్మానాన్నలను ఒప్పించాడు. కానీ పెళ్లి చేయడానికి వారి దగ్గర డబ్బు లేకపోవడంతో ఆ భారాన్ని కూడా అనిల్ తనపైనే వేసుకున్నాడు. ఇంకో నెలలో అతని పెళ్లి జరగాల్సి ఉంది. అయినా కూడా సంజనలో ఇసుమంతైనా సంతోషం లేదు.
అమ్మానాన్నలంటే ఇష్టం లేదు అని చెప్పిన ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి అనగానే అమ్మానాన్నలను వదిలి రావాలంటే అదోలా ఉంది అని చెప్తోందట. అప్పటికీ అనిల్ పెళ్లయ్యాక నీకు నచ్చినప్పుడు మీ పుట్టింటికి వెళ్లు అని చెప్పి బతిమాలుకుంటున్నాడట. ఇలా ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి నువ్వే నా లోకం అని మాట్లాడుతూ ఇప్పుడు పెళ్లి మాట రాగానే ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో అర్థంకాక ఆ అబ్బాయి తలబాదుకుంటున్నాడు.
అమ్మాయి రాసిన స్టోరీ
ఈ స్టోరీ రాసిన అమ్మాయిది కూడా హైదరాబాదే. అమ్మాయి పేరు అష్మిత (పేరు మార్చాం). చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అప్పటినుంచి తాతగారే పెంచి చదివించారు. అలా డిగ్రీ వరకు చదువుకుని ఇప్పుడు అమ్మని, తమ్ముడిని తనే చూసుకుంటోంది. అష్మితకి పుట్టుకతోనే ఒక లోపం ఉంది. పుట్టినప్పుడే ఏదో కారణంతో ఒక కిడ్నీ తీసేసారట. దాంతో పెళ్లి కాదేమో అని భయపడుతుండేది. అలా ఓసారి అష్మిత టిండర్ యాప్ ఓపెన్ చేసింది. అందులో రిషి (పేరు మార్చాం) అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. వీరిద్దరి కులాలు వేరు. అయినా కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అని అష్మితనే రిషికి ప్రపోజ్ చేసింది. రిషి కూడా ఇంట్లో ఒప్పుకుంటారులే అన్న నమ్మకంతో ఓకే చెప్పాడు.
అష్మిత ఇంట్లో అంతా ఒప్పుకున్నారు. కానీ రిషి ఇంట్లో ఈ విషయం చెప్తే మరీ తండ్రిలేని పిల్లను ఆస్తి లేని పిల్లను చేసుకుంటే గతిలేక చేసుకున్నారా అని ఇరుగు పొరుగు అనుకుంటారని ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి కాస్త గట్టిగా మాట్లాడి ఉంటే పెళ్లికి ఒప్పుకునేవారే. కానీ రిషి వెనకడుగు వేసాడు. ఇంట్లో ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటే ఆ విలువ, గౌరవం వేరుగా ఉంటాయి అని చెప్పాడు. అది కూడా నిజమే కదా అని అష్మిత ఎప్పుడో ఒకప్పుడు ఒప్పుకోకపోరా అని ఎదురుచూస్తోంది. ఇక్కడ సమస్య ఏంటంటే.. అష్మిత రిషి కోసమే వెయిట్ చేస్తుంటే రిషి మాత్రం అష్మిత కాకపోతే వేరే అమ్మాయిని చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడట.
చివరికి వీరిద్దరూ ఏం చెప్పాలనుకుంటున్నారంటే.. పెళ్లి చేసుకునే ధైర్యం లేనప్పుడు, ఇంట్లో ఒప్పించే ధైర్యం లేనప్పుడు లేనిపోని ఆశలు కల్పించి జీవితాలతో ఆడుకోకండి అని వేడుకుంటున్నారు.