Viral News: బిడ్డను కంటే రూ.62 లక్షలు ఇచ్చే కంపెనీ..!
Viral News: పిల్లల్ని కంటే ఓ దేశం అక్షరాలా రూ.62 లక్షలు ఇస్తానంటోంది. అంటే అక్కడ ఏ స్థాయిలో జనాభా పడిపోయిందో ఆలోచించండి. ఇంతకీ ఏ దేశంలో ఇలా పిల్లల్ని కంటే అంత డబ్బు ఇస్తున్నారంటే దక్షిణ కొరియా. ఈ దేశంలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోయింది. దాంతో దక్షిణ కొరియాకు చెందిన బూయంగ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే రూ.63 లక్షలు ఇస్తామని ప్రకటన విడుదల చేసింది. (Baby)
ఇలా ఎంత మంది పిల్లల్ని కంటే అంత మందికి ఇస్తారట. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. 2021 నుంచి తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్లో అంతా కలిసి దాదాపు 70 మంది పిల్లల్ని కంటే వారికి రూ.50 కోట్ల వరకు దానం చేసింది. దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి రేటు కేవలం 0.78 శాతం మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటు కలిగిన దేశం దక్షిణ కొరియానే. 2025 నాటికి ఈ సంతానోత్పత్తి రేటు 0.65 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది.
అసలు దక్షిణ కొరియాలో ఉన్న సమస్య ఏంటి?
దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం అనేది 1960ల నుంచి మొదలైంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రధానంగా అక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల స్కూల్ ఫీజులు వంటివి మరీ ఎక్కువగా ఉండటంతో దాని కంటే పిల్లల్ని కనకపోవడమే బెటర్ అని నిర్ణయించేసుకున్నారు. 1960ల నాటికే దక్షిణ కొరియాలో విపరీతంగా జనాభా, సంతానోత్పత్తి రేటు పెరిగిపోయింది. దాంతో అక్కడి ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ప్లానింగ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.
1950 నుంచి 1053 వరకు జరిగిన కొరియన్ యుద్ధంలో దక్షిణ కొరియా చాలా కోల్పోయింది. ఆర్ధిక పరిస్థితులు మళ్లీ కోలుకోలేని స్థితికి చేరడంతో సంతానోత్పత్తి నియంత్రణ ఉండాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వస్తోందే కానీ పెరగడంలేదు. అయితే దక్షిణ కొరియాలో ఎంత మంది పిల్లల్ని కనాలి అనే నియమం ఏమీ లేదు. ఎంత మందినైనా కనచ్చు. కాకపోతే వారిని పెంచి పోషించే స్థాయి, స్తోమత లేని వారు పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు బూయంగ్ కంపెనీ ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలనుకుంటోంది. బూయంగ్ కంపెనీ రూల్స్ ప్రకారం ముగ్గురు పిల్లల్ని కంటే అయితే రూ.1.8 కోట్ల నగదు ఇస్తారు లేదా ఓ ఇల్లు కానీ ప్రభుత్వం నుంచి కొంత భూమిని కానీ ఇప్పిస్తారు. (Viral News)
1983లో బూయంగ్ కంపెనీని స్థాపించారు. అప్పటినుంచి 270,000 ఇళ్లను నిర్మించింది. సంతానోత్పత్తి రేటు పెంచేందుకు గతంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ బూయంగ్ కంపెనీకి మాత్రమే పాపులారిటీ వచ్చింది. చైనాలోనూ సంతానోత్పత్తి శాతం తగ్గిపోతోంది. దాంతో స్థానిక ట్రిప్.కామ్ అనే ఆన్లైన్ బుకింగ్ సర్వీసెస్ కంపెనీ తమ ఉద్యోగులకు ఏటా రూ.1.1 లక్ష బోనస్లు ఇస్తోంది. ఇలా పిల్లలు పుట్టి వారికి ఐదేళ్లు వచ్చేవరకు వార్షిక బోనస్లు ఇస్తామని ప్రకటించింది.
ఉత్తర కొరియాలోనూ ఇదే పరిస్థితి
ఉత్తర కొరియాలోనూ ఇదే పరిస్థితి నడుస్తోంది. పాలన విషయంలో దక్షిణ కొరియా కంటే ఉత్తర కొరియా డేంజర్ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఉత్తర కొరియాలో కిమ్ నియంత పాలన నడుస్తోంది కాబట్టి. ఇటీవల కిమ్ మీడియా ముందుకు వచ్చి పిల్లల్ని కనండి సంతానోత్పత్తిని పెంచండి అని కన్నీరుపెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.