Supreme Court న్యాయవాది దారుణ హత్య
ఓ సుప్రీంకోర్టు (supreme court) న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడా సెక్టర్ 30లో నివసిస్తున్న రేణూ షిండే అనే మహిళ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమెను భర్త నితిన్ షా శనివారం రాత్రి దారుణంగా హత్య చేసి శవాన్ని బాత్రూమ్‌లో పెట్టి లాక్ చేసాడు. పోలీసులకు దొరక్కుండా 36 గంటల పాటు వారు నివసిస్తున్న బంగ్లాలోని స్టోర్ రూంలోనే దాక్కున్నాడు.
రేణూ సోదరుడు రెండు రోజులుగా ఆమెకు కాల్స్ చేస్తున్నా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు వెంటనే వారు ఉంటున్న బంగ్లాకు వెళ్లి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నితిన్‌ను పట్టుకున్నారు. రేణూ, నితిన్ ఉంటున్న బంగ్లాను అమ్మేయాలన్న విషయంలో ఎప్పటినుంచో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. బంగ్లా అమ్మడం రేణూకి ఇష్టం లేదని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపాడు. అయితే అప్పటికే బంగ్లా అమ్మడానికి సగం డబ్బును తీసుకున్న నితిన్ ఏం చేయాలో తెలీక ఆమెను హత్య చేసాడని పేర్కొన్నాడు. రేణూ, నితిన్‌ల కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. తల్లి మరణవార్త తెలిసి వెంటనే ఆయన్ను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేసారు. (supreme court lawyer murder)