ఆత్మహత్యకు అనుమతి కోరిన జడ్జ్.. కలగజేసుకున్న CJI
Supreme Court: ఓ మహిళా న్యాయమూర్తి తోటి న్యాయమూర్తులు లైంగికంగా వేధిస్తుండడంతో తనకు వేరే దారి లేక ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు (dy chandrachud) లేఖ రాసారు. దాంతో చంద్రచూడ్ వెంటనే ఆ జడ్జ్‌కి సంబంధించిన కేసు వివరాలు కావాలని ఆలహాబాద్ హైకోర్టును ఆదేశించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన మహిళా జడ్జ్ కొన్నేళ్లుగా తోటి జడ్జ్‌ల నుంచి వేధింపులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టులో కేసు వేస్తే తనను టార్చర్ పెడుతున్న జడ్జ్‌ల వద్ద పనిచేస్తున్న వారి నుంచి వాంగ్మూలం తీసుకుంటామని చెప్పారని.. ఎవరైనా బాస్ మీద వ్యతిరేకంగా సాక్ష్యం ఎలా చెప్తారని ఆమె వాపోయారు.
సుప్రీంకోర్టులో కేసు వేస్తే వారు కేవలం 8 క్షణాల్లోనే కేసును డిస్మిస్ చేసారని తెలిపారు. తనను ఒక పనికిరాని పురుగు కంటే హీనంగా చూస్తున్నారని.. ఏడాదిన్నరగా జీవచ్ఛవంగా బతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం నయమని చనిపోవడానికైనా అనుమతి కావాలని కోరుతూ లేఖ రాయడంతో చంద్రచూడ్ వెంటనే స్పందించారు. సుప్రీంకోర్టు సెక్రటరీ జర్నల్ వెంటనే అలహాబాద్ హైకోర్టుకు నోటీసులు జారీ చేసారు.