Supreme Court: భారత్‌లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చద్దు
Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. కర్ణాటకకు చెందిన ఓ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ భూమి తగాదానికి సంబంధించిన కేసులో భాగంగా వాదోపవాదాలు విన్న సదరు న్యాయమూర్తి.. అది ముస్లిం ప్రదేశం కాబట్టి పాకిస్థాన్ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చంద్రచూడ్ నివేదిక పంపాలని ఆదేశించారు.
అసలేం జరిగింది?
కర్ణాటక హైకోర్టు జడ్జి వేదవ్యసచార్ శ్రిషానంద ఓ ల్యాండ్ కేసును పరిశీలించారు. ఆ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు విన్నాక తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. ఈ భూమి బెంగళూరులోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉంది. అంటే అది పాకిస్థాన్ లాంటిది అన్నారు. అంతేకాదు.. ఓ మహిళా న్యాయవాదికి అపోజిషన్ పార్టీ పట్ల ఉన్న అవగాహన గురించి ప్రశ్నిస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ రెండు వివాదాలు సోషల్ మీడియాలో దుమారం రేపడంతో చంద్రచూడ్ దృష్టిలో పడింది.
ఈ సోషల్ మీడియా జమానాలో న్యాయస్థానాలు మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రచూడ్ సదరు హైకోర్టు జడ్జికి చీవాట్లు పెట్టారు. ఆయన చేత క్షమాపణలు చెప్పించడమే కాకుండా.. భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని కూడా పాకిస్థాన్ అనడం తప్పని అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు గౌరవనీయమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి ఆ మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తూ అతన్ని వదిలేసారు.