Sumit Nagal: ఆర్ధిక ఇబ్బందుల్లో నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్
భారతదేశ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ (sumit nagal) ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడట. ఈ విషయాన్ని అతనే మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రస్తుతానికి తన బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయని దానితోనే నెట్టుకొస్తున్నానని తెలిపాడు. జర్మనీలోని నాన్సెల్ టెన్నిస్ అకాడమీలో కొన్నాళ్లుగా ట్రైనింగ్ తీసుకుంటున్నానని కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తనకు ఇష్టమైన అకాడమీలో శిక్షణ తీసుకోలేకపోయానని తెలిపాడు. కొంతకాలం పాటు తన స్నేహితులు సోమ్‌దేవ్, క్రిస్టొఫర్ మార్కిస్ సాయం చేయడంతో నిలదొక్కుకోగలిగానని పేర్కొన్నాడు.
“” మెన్స్ సింగిల్‌లో భారత్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ అయినప్పటికీ నా దగ్గర ఫండ్స్ లేవు. నాకోసం ఎవ్వరూ పెద్దగా స్పాన్సర్ చేయడంలేదు. 2023 జనవరిలో నా ఖాతాలో కేవలం లక్ష రూపాయలు ఉండేవి. మహా టెన్నిస్ ఫౌండేషన్‌లో ట్రైనింగ్ కోసం నాకు ప్రశాంత్ సుతార్ అనే వ్యక్తి సాయం చేస్తున్నాడు. IOCL నుంచి జీతం వస్తుంది కానీ అది నాకు నా కుటుంబానికి సరిపోవడం లేదు. మన ఇండియాలో టెన్నిస్ ప్లేయర్లను అసలు ఎవ్వరూ పట్టించుకోరు. సరైన గైడెన్స్ ఉండదు. సిస్టమ్ బాగోలేదు. సిస్టమ్ బాగుంటే ఫండ్స్ కూడా బాగుంటాయ్. నాకు కోవిడ్ సోకినప్పుడు నడుము దగ్గర సర్జరీ కూడా అయింది.
ఆరు నెలల పాటు లేవలేకపోయాను, దాంతో నేను ఇక ఆడలేను అనుకున్నారు, కానీ నేను ఇప్పటికీ ఫాంలోనే ఉన్నాను. ఛార్ట్‌లో నా నెంబర్ ఎక్కడుందో ఒకసారి చూడండి. మనం చైనాకు ఏమాత్రం తీసిపోం. కానీ మనకంటే చైనా దగ్గర ఎందుకు మెడల్స్ ఎక్కువగా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. నా దగ్గర సేవింగ్స్ ఏమీ లేవు. ఇప్పటికైనా నా గురించి కాస్త ఆలోచిస్తే ఇంతకంటే పెద్ద టోర్నమెంట్లలో ఆడి నేనేంటో నిరూపించుకోగలను “” అని సుమిత్ ఆవేదన వ్యక్తం చేసాడు. (sumit nagal)