Sudan: తిండి కావాలంటే సైనికులతో పడుకోవాల్సిందే
Sudan: యుద్ధంతో తల్లడిల్లిపోతున్న సుడాన్‌లో మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి కడుపు నింపుకోవాలన్నా.. కుటుంబంలోని వారి ఆకలి తీర్చాలన్నా అక్కడి సైనికులతో పడుకోవాల్సిందేనట. మహిళలను వరుసగా లైన్‌లో నిలబెట్టి మరీ సైనికుల దగ్గరికి పంపుతున్న సంఘటనలు అక్కడ రోజూ చోటుచేసుకుంటున్నాయి. సుడాన్‌లోని ఓందుర్మాన్ అనే ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు తప్పించుకుని వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఈ విషయాలు బయటికి వచ్చాయి. దాదాపు 24 మంది మహిళలు సుడాన్ నుంచి బయటపడ్డారు.
ఫ్యాక్టరీలలో నిల్వ ఉంచిన ఆహారం కోసం వెళ్తే.. అక్కడ ఉన్న సైనికులు ఆడవాళ్లపై పైశాచికంగా ప్రవర్తించి అత్యాచారాలు చేస్తున్నారని.. తిండి కావాలంటే తమతో పడుకోవడం ఒక్కటే మార్గం అని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. సుడాన్‌కి చెందిన ఆర్మీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనే పారామిలిటరీ గ్రూప్‌పై పోరాటం చేస్తున్న నేపథ్యంలో పౌర యుద్ధం ఏర్పడింది. 2023 ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి వరకు సుడాన్‌లో ఈ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. దాంతో జన జీవనం స్తంభించింది. ఈ అల్లర్ల కారణంగా ఏడాదిలో 1,50,000 మంది మృతిచెందారు. పౌర యుద్ధంగా మొదలైన ఈ సమరం మెల్లిగా ఆడవాళ్లపై అత్యాచారాలకు దారి తీసేలా మారింది.