Nambi Narayanan: కోరిక తీర్చని విదేశీ యువతి.. కోపంతో నంబిని ఇరికించిన అధికారి.. సీబీఐ విచారణలో విస్తుపోయే అంశాలు
Nambi Narayanan: ఇస్రోలో పనిచేస్తూ గూఢచారానికి పాల్పడ్డాడని ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై 1994లో కేసు వేసారు. ఈ కేసు గురించి నంబి నారాయణన్ గురించి ప్రముఖ నటుడు మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనే సినిమా కూడా తీసారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన షాకింగ్ విషయాలు సీబీఐ కేరళ హైకోర్టుకు తెలిపింది.
కేరళకు చెందిన విజయన్ అనే సీనియర్ పోలీస్ అధికారి మాల్దీవ్స్‌కి చెందిన మరియం రషీదా అనే యువతిని తన కోరిక తీర్చాలని కోరారు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ కోపంతో ఎలాగైనా రషీదాను ఇరికించాలని ఆమెకు నంబి నారాయణన్‌కు ఎఫైర్ ఉందని వీరిద్దరూ కలిసే గూఢచర్యానికి పాల్పడ్డాడని తప్పుడు కేసు ఫైల్ చేయించాడట. అలా రషీదాను దేశం దాటనివ్వకుండా ఆమె పాస్‌పోర్ట్ ఇతర డాక్యుమెంట్లను విజయన్ సీజ్ చేసారు. ఇస్రోకు చెందిన మరో శాస్త్రవేత్తతో రషీదాకు ఆమె స్నేహితురాలికి సంబంధాలు ఉన్నాయన్న విషయం విజయన్‌కు తెలీడంతో కేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది.
ఈ నేపథ్యంలో కేరళ పోలీసులతో పాటు సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) కలిసి ఆ యువతులు ఇద్దరినీ విచారణ చేపట్టగా అనుమానాస్పద అంశాలేవీ కనిపించలేదు. కాకపోతే రషీదా తన వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇండియాలోనే నివసించినందుకు ఆమెను అరెస్ట్ చేసారు. ఆమె కస్టడీ పూర్తవుతున్న నేపథ్యంలో విజయన్ ఓ ప్లాన్ వేసాడు. ఇస్రోకు చెందిన నలుగురు శాస్త్రవేత్తలతో కలిసి రషీదా, ఆమె స్నేహితురాలు కీలక సమాచారాన్ని బయటి దేశాలకు చేరవేస్తున్నారని విజయన్ ఆరోపించారు. దాంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తలను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1994లో నంబి నారాయణన్ అరెస్ట్ అవ్వగా.. 1996లో సీబీఐ నారాయణన్‌పై తప్పుడు కేసు పెట్టారని కోర్టుకు చెప్పింది. దాంతో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. 2018లో సుప్రీంకోర్టు నంబి నారాయణన్‌కు రూ.50 లక్షల పరిహారంతో పాటు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలా సీబీఐ విచారణ చేపడుతుండగా విజయన్‌తో పాటు ఇతర పోలీస్ అధికారుల ప్రేమేయం ఉందని బయటపడింది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు కేరళ హైకోర్టుకు వెల్లడించారు.