Shazia Manzoor: హ‌నీమూన్ గురించి అడిగిన యాంక‌ర్.. చెంప‌ ప‌గ‌ల‌గొట్టిన సింగ‌ర్

Shazia Manzoor: ఈ మ‌ధ్య‌కాలంలో ఏ టీవీ షో చూసినా బూతు పురాణం త‌ప్ప ఏమీ క‌నిపించ‌డంలేదు. ప్రేక్ష‌కులు చూస్తున్నారు క‌దా న‌వ్వుకుంటున్నారు క‌దా అని మ‌రీ మితిమీరిపోతున్నారు. మ‌రీ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా న‌లుగురి ముందు మాట్లాడేస్తుంటే ఎవ‌రికి మాత్రం కోపం రాదు చెప్పండి. పాకిస్థాన్‌కి చెందిన ఓ ప్ర‌ముఖ సింగ‌ర్‌ని షోకి పిలిపించి ఆమెతో హ‌నీమూన్ గురించి చ‌ర్చించ‌డంతో ఆ సింగ‌ర్ ఒక్క‌సారిగా ఆగ్ర‌హానికి గుర‌య్యారు. లైవ్ షోలోనే యాంక‌ర్ చెంప చెళ్లుమ‌నిపించారు.

అస‌లేం జ‌రిగింది?

షాజియా మన్జూర్ (Shazia Manzoor) అనే ప్ర‌ముఖ పాకిస్థానీ సింగ‌ర్ ప‌బ్లిక్ డిమాండ్ అనే షోకి గెస్ట్‌గా వెళ్లారు. ఈ షోకి షెర్రీ నాన్హా అనే వ్య‌క్తి యాంక‌ర్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో షెర్రీ నాన్హా.. షాజియాను చూస్తూ ఒక మాట‌న్నాడు. షాజియా.. మ‌న‌కే గ‌న‌క పెళ్లైతే నిన్ను హ‌నిమూన్‌కి మోంట్ కార్లోకి తీసుకెళ్తాను. నువ్వు విమానంలో ఏ క్లాస్‌లో ప్ర‌యాణించాల‌నుకుంటున్నావ్ అని అడిగాడు. దాంతో షాజియాకు ఒళ్లు మండింది. వెంట‌నే కుర్చీ నుంచి లేచి షెర్రీ నాన్హా చొక్కా ప‌ట్టుకుని చెంప ప‌గ‌ల‌గొట్టింది. గ‌తంలో కూడా నువ్వు ఇలాగే ప్ర‌వ‌ర్తించావ్. అప్పుడు నేను ప్రాంక్ చేయ‌డానికి నీపై మండిప‌డిన‌ట్లు న‌టించాను. ఈసారి నా కోపం ప్రాంక్ కాదు న‌ట‌న అంత కంటే కాదు. నేను చాలా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నాను. ఆడ‌వారితో హ‌నీమూన్ అంటూ ఇలాగేనా మాట్లాడేది అని మండిప‌డ్డారు.

ALSO READ: Viral News: పెళ్లైన మూడు నెలలకే.. భర్త మృతితో భార్య ఆత్మహత్య..!

దాంతో ప‌క్క‌నే ఉన్న మోహ్సిన్ అబ్బాస్ హైద‌ర్ అనే మ‌రో గెస్ట్ వెంట‌నే క‌ల‌గ‌జేసుకుని ప‌రిస్థితిని శాంతిప‌జేసారు. ఈ సంద‌ర్భంగా నాన్హాకి వార్నింగ్ కూడా ఇచ్చారు. స్క్రిప్ట్ ప్ర‌కారం న‌టిస్తే బాగుంటుంద‌ని అన‌వ‌స‌రంగా లేని పోనివి క‌ల్పించి మ‌సాలా జోడించాలని చూస్తే మాత్రం బాగోద‌ని హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత షాజియా ఇంకెప్పుడూ ఇలాంటి షోకి రాన‌ని అరుచుకుంటూ షో నుంచి వాకౌట్ చేసేసారు. దాంతో ఈ వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మితిమీరి ప్ర‌వ‌ర్తించే యాంక‌ర్ల‌కు ఈ వీడియో ఓ చెంప‌పెట్టు లాంటిది అంటూ నెటిజ‌న్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు.

మ‌నోళ్లు త‌క్కువేమీ కాదు

హిందీలో కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే షో ఎంతో పాపుల‌ర్. ఆ షోలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఇంత‌కంటే నీచంగా ప్ర‌వ‌ర్తించారు. అక్ష‌య్ కుమార్, ఇలియానా క‌లిసి గెస్ట్‌లుగా ఈ షోకి వెళ్లిన‌ప్పుడు ఇలియానా తానొక బాత్రూమ్ సింగర్‌న‌ని కానీ బ‌య‌ట మాత్రం పాడే ధైర్యం చేయ‌లేన‌ని అన్నారు. అది విన్న అక్ష‌య్ కుమార్.. మ‌మ్మ‌ల్ని కూడా మీ బాత్రూమ్ లైవ్ షోకి ఆహ్వానించు అని కామెంట్ చేసారు. ఇలాంటి వ‌ర‌స్ట్ కామెంట్‌కు ఎవ‌రైనా చెంప ప‌గ‌ల‌గొట్ట‌డ‌మో లేదా వార్నింగ్ ఇవ్వ‌డ‌మో వంటివి చేస్తారు. కానీ బాలీవుడ్‌లో ఇలాంటివి చేసే ధైర్యం ఎవ్వ‌రికీ లేదు.