Sam Altman: తనను తొలగించిన బోర్డు సభ్యులను పీకేసిన ఓపెన్ ఏఐ సీఈఓ
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని పెద్దలు ఊరికే అన్నారా..! ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మ్యాన్ (sam altman) విషయంలో ఇదే జరిగింది. ఇటీవల సామ్ ఆల్ట్‌మ్యాన్‌ను ఓపెన్ ఏఐ బోర్డు సభ్యులు అతన్ని సీఈఓ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. చాట్ జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసిన సామ్లో కావాల్సిన నైపుణ్యాలు లేవని.. అతను నిజాయతీగా ఉండటం లేదని లేని పోని కారణాలు చెప్పి తొలగించారు. ఇది టెక్నాలజీ రంగానికే పెద్ద షాక్ కలిగించింది.
ఆ తర్వాత ఇదే మంచి సమయం అనుకున్న మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల (satya nadella) సామ్‌ను తన కంపెనీలోకి ఆహ్వానించారు. అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ డిపార్ట్మెంట్కు అధినేతగా చేస్తానని అన్నారు. ఇందుకు సామ్ కూడా ఒప్పుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. వెంటనే ఓపెన్ ఏఐ నుంచి సామ్‌కు మళ్లీ పిలుపు వచ్చింది. మళ్లీ సీఈఓగా బాధ్యతలు తీసుకోవాలని కంపెనీ కోరింది. ఇందుకు సామ్ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. అకారణంగా తనను సీఈఓ పదవి నుంచి తొలగించిన బోర్డు సభ్యులను ఇప్పుడు సామ్ తొలగించేసాడు. సామ్ లేకపోతే తాము కూడా కంపెనీలో ఉండమని కొందరు ఉద్యోగులు హెచ్చరించడంతోనే ఓపెన్ ఏఐ మళ్లీ సామ్‌ను వెనక్కి తెచ్చుకుందని తెలుస్తోంది.