Rupert Murdoch: 92 ఏళ్ల మీడియా దిగ్గజం ఐదో పెళ్లి..!
Rupert Murdoch: ప్రముఖ మీడియా దిగ్గజం రూపర్ట్ మూర్డోక్ 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధం అయ్యారు. రష్యాకి చెందిన విశ్రాంత మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలీనా జుకోవా (Elena Zhukova) (67)ను వివాహం చేసుకోబోతున్నారు. కాలిఫోర్నియాలోని రూపర్ట్‌కి చెందిన గార్డెన్‌లో వీరి నిశ్చితార్ధం ఘనంగా జరగనుంది. ఫాక్స్ అండ్ న్యూస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ వచ్చిన రూపర్ట్.. గతేడాది తన పదవికి రాజీనామా చేసారు.
ఇతనికి ఆల్రెడీ నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. నలుగురు పిల్లలు ఉన్నారు. వారికి కూడా మనవళ్లు పుట్టేసారు. ఈ వయసులో రూపర్ట్ పెళ్లి చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తోడు కావాలంటే పెళ్లే చేసుకోవాలన్న రూల్ ఏముంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రూపర్ట్ మాజీ భార్య వెండీ డెంగ్ ఏర్పాటుచేసిన పార్టీలో ఎలీనా జుకోవాతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. జూన్‌లో వీరి వివాహం జరగనుంది.
1950ల్లో రూపర్ట్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటికి మీడియా ప్రపంచానికి ఓ వింత లాంటిది. అలాంటి సమయంలోనే ఆయన యూకేలో 1969లో న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ న్యూస్ పత్రికలను స్థాపించి మీడియా రంగంలో ఓ దిగ్గజంలా ఎదిగారు. 1996లో ఈయన ఫాక్స్ న్యూస్‌ను ప్రారంభించారు. ఇది అమెరికాలో అత్యధిక మంది వీక్షించే ఛానెల్‌గా పేరుగాంచింది. కొన్ని వందల ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ మీడియా ఛానెల్స్‌కు రూపర్ట్ అధినేత. గతేడాది సెప్టెంబర్‌లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని తన కుమారులకు వ్యాపారాలను అప్పగించారు.