Rishabh Pant: అండర్ 19 క్రికెటర్ చేతిలో మోసపోయిన రిషబ్
Rishabh Pant: ప్రముఖ రిషబ్ పంత్ దోపిడీకి గురయ్యారు. ఆయనను మోసం చేసిన వ్యక్తి కూడా అండర్ 19లో శిక్షణ తీసుకుంటున్న క్రికెటర్ రావడం గమనార్హం. హర్యానాకు చెందిన మృణాంక్ సింగ్ అనే వ్యక్తికి రిచ్ జీవితం గడపాలని ఆశ. ఇతను హర్యానా నుంచి గతంలో అండర్ 19లో ఆడాడు. ముంబై ఇండియన్స్ టీం తరఫున ఆడుతున్నానని చెప్పి అమ్మాయిల నుంచి లక్షల్లో డబ్బులు దోచేసాడు. అంతర్జాతీయ బ్రాండ్లను కూడా నమ్మబలికాడు. 2020 నుంచి 2021 మధ్యలో రిషబ్ పంత్ నుంచి రూ.1.63 కోట్లు దోపిడీ చేసాడు.
ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజ్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎంబీఏ చేసిన మృణాంక్ సింగ్ చెడు అలవాట్లకు బానిస అవడంతో అతని తల్లిదండ్రులు కూడా వదిలేసారు. అప్పటినుంచి తప్పుడు దారుల్లో ప్రజలను మోసం చేస్తూ వారి నుంచి డబ్బులు దోచుకునేవాడు. ఒకవేళ పోలీసులకు దొరికిపోయినా తప్పించుకునేలా ఉండేందుకు కర్ణాటక ఏడీజీ అలోక్ కుమార్ గెటప్ కూడా ఎత్తేవాడు. 2022లో ఢిల్లీలోని తాజ్ హోటల్లో దాదాపు వారం రోజులు ఉన్న మృణాంక్ రూ.5 లక్షల బిల్లు చేసి చెకౌట్ అవ్వాలని చూసాడు. బిల్లు కావాలని అడిగితే తాను ముంబై ఇండియన్స్ క్రికెటర్‌నని తన బిల్లును అడిడాస్ సంస్థ కడుతుందని నమ్మబలికాడు. ఆ తర్వాత రూ.2 లక్షల మేర బిల్లు కట్టినట్లు వివరాలు చూపించాడు. తీరా చూస్తే ఆ వివరాలు తప్పు అని తెలుసుకుని హోటల్ వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఆ తర్వాత ఈ నెల 25న హాంకాంగ్ పారిపోవాలని చూసిన మృణాంక్‌ను ఢిల్లీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు. అప్పుడు కూడా తప్పించుకోవడానికి మృణాంక్ ఒక ప్లాన్ వేసాడు. ఆ సమయంలో కర్ణాటక ఏడీజీ అలోక్ కుమార్‌గా ఫోజు కొట్టి తన కుమారుడు మృణాంక్‌ను పోలీసులు పట్టుకున్నారని వదిలేయాలని మరో వ్యక్తితో ఫోన్ చేయించాడు. కానీ ఈ సారి పోలీసులు అతని మాటలు నమ్మలేదు. వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.