Real Estate: హైదరాబాద్‌లో పడిపోయిన మార్కెట్
Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మందగించింది. కొనుగోళ్లు పడిపోయాయి. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్యలోనే 42 శాతానికి కొనుగోళ్లు పడిపోయాయి. గతేడాది 20,658 ప్రాపర్టీలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది భారీగా తగ్గాయి. ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో 12,082 ప్రాపర్టీలు అమ్ముడుపోవాల్సి ఉంది. మరి అవి అమ్ముడుపోతాయో లేదో అనే సందేహం రియల్ ఎస్టేట్ నిపుణుల్లో ఉంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అవ్వడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేయడం. రోజురోజుకీ పెరిగిపోతున్న నిత్యవసర ధరలు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పట్ల కొనుగోలుదారుల్లో ఉన్న అనిశ్చితి. ఇక రానున్న రోజుల్లో దసరా, దీపావళి ఉన్న నేపథ్యంలో మార్కెట్ మళ్లీ లేస్తుందని డెవలపర్లు ఆశిస్తున్నారు.
హైడ్రా భయం
ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోందన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల క్రితం అప్పు చేసి కష్టపడి కట్టుకున్న సామాన్య ప్రజల ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. రోజుకో ఏరియాలో తనిఖీలు చేసి ఏ ఏ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వస్తాయో అంచనా వేసి కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారు.
కనీసం ఇంట్లోని వస్తువులు, సామాన్లు బయట పెట్టుకునే సమయం కూడా ఇవ్వడంలేదని బాధితులు వాపోతున్నారు. ఏ భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందో సామాన్యులమైన తమకు ఎలా తెలుస్తుందని.. అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని వారు వాపోతున్నారు. అధికారులు ఇళ్లు కట్టుకోమని అనుమతిస్తేనే కట్టుకున్నామని.. ఇప్పుడు తప్పంతా తమదే అంటూ ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికెళ్లి బతకాలని కన్నీరుమున్నీరవుతున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల పట్ల మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం
తాజాగా ఈరోజు హైడ్రా అధికారులు మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ బాధితుడి ఇంటిని కూల్చేసారు. ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని కేవలం మూడు రోజులే అవుతోందట. తాము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు. రిజిస్ట్రేషన్ ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం. అనుమతులు అన్నీ ఉన్నాయని ఇల్లు కొన్నామని ఇల్లు కూల్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాకయ్యామని తెలిపారు.
ఏండ్ల తరబడి కష్ట పడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నామని.. బ్యాంకు లోను కూడా తీసుకున్నామని వాపోయారు.
ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయిందని ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం అంటూ కన్నీరుపెట్టుకున్నారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని తమ లాంటి బాధితులకు న్యాయం చేయాలని హైడ్రా బాధితులు డిమాండ్ చేస్తున్నారు.