Ratan Tata: వీలునామాలో పెంపుడు కుక్కల పేర్లు
Ratan Tata: దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. తన వీలునామాలో పెంపుడు కుక్క పేరును కూడా చేర్చారట. రతన్ టాటా పెంపుడు శునకాల్లో టీటో అనే జర్మన్ షెపర్డ్ ఉంది. ఈ కుక్క కోసమే ఓసారి టాటా బ్రిటన్ రాజవంశం చేతుల మీదుగా అందుకోవాల్సిన అవార్డును కూడా వద్దనుకున్నారు. ఆరేళ్ల క్రితం రతన్ టీటోను దత్తత తీసుకున్నారు. టీటో కంటే ముందు ఇదే పేరుతో మరో కుక్క ఉండేది. అది చనిపోవడంతో దాని గుర్తుగా రతన్ మరో కుక్కను దత్తత తీసుకుని దానికి కూడా టీటో అనే పేరు పెట్టుకున్నారు. తన తదనంతరం టీటోను అన్ని విధాలా చూసుకోవాలని వీలునామాలో రాసారట. ప్రస్తుతం టీటోను రతన్ పర్సనల్ చెఫ్ అయిన రజన్ షా చూసుకుంటున్నారు.
టీటోతో పాటు రతన్ పెంచుకుంటున్న గోవా, సుబ్బయ్య, బట్లర్‌ల పేర్లను కూడా వీలునామాలో చేర్చారు. రతన్ టాటా ఆస్తుల విలువ రూ.10వేల కోట్లు. అలీబాగ్‌లో బీచ్‌కి దగ్గరగా ఉన్న 2000 చదరపు అడుగుల బంగ్లా, ముంబైలోని జుహులో రెండు అంతస్తుల భవనం, రూ.350 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, టాటా సన్స్ కంపెనీల 0.83% వాటా.. ఇవన్నీ రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్‌కు బదిలీ కానున్నాయి. ఇందులో కొంత వాటాను తన వద్ద జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న శాంతాను నాయుడుకు కూడా రాసినట్లు తెలుస్తోంది.