Ratan Tata: యజమానిని కడసారి చూస్తూ…
Ratan Tata: ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్త రతన్ టాటా పెంపుడు శునకం గోవా తన యజమానిని చివరిసారి చూసుకునేందుకు వచ్చింది. టాటా ఎంతో ఇష్టంగా పెంచుకున్న వీధి కుక్క గోవాను ఆయన పార్థివదేహం వద్దకు తీసుకుని వచ్చారు. తనను చేరదీసి ఎంతో ప్రేమగా చూసుకున్న యజమానిని చూస్తూ అది బాధపడుతూ శబ్దాలు చేయడం అక్కడి వారిని కలచివేసింది. గోవాలో ఓ సమావేశం నిమిత్తం రతన్ టాటా అక్కడికి వెళ్లగా.. ఓ వీధి కుక్క రతన్ చుట్టూనే తిరుగుతూ కనిపించింది. దాంతో దానిని ముంబైలోని తన ఇంటికి తీసుకెళ్లాలని రతన్ నిర్ణయించుకున్నారు. అది గోవాలో దొరికింది కాబట్టి దానికి పేరు కూడా గోవా అనే పెట్టారు.
రతన్ దగ్గరు రెండు మూడు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటిలో గోవా ఒకటి. ఓసారి బ్రిటన్ రాజ కుటుంబం నుంచి రతన్‌కు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందింది. ఇందుకోసం ఆయన అవార్డు తీసుకునేందుకు లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ అదే సమయంలో గోవాకు అనారోగ్యం చేసింది. గోవాను వదిలి టాటా లండన్ వెళ్లలేకపోయారు. ఏమాత్రం వెనుకాడకుండా రాజకుటుంబీకులకు ఫోన్ చేసి మరీ తన పెంపుడు శునకానికి ఒంట్లో బాలేదని.. ఈ సమయంలో దానిని వదిలి లండన్ రాలేనని తన పర్యటనను రద్దు చేసుకున్నారు రతన్. కుక్కల పట్ల రతన్‌కి ఉన్న ప్రేమ అలాంటిది.
షాపుల ముందు పాపం ఏదో ఒకటి పెట్టకపోరా అని ఎదురుచూసే కుక్కలను కొట్టి తరిమేస్తుంటారు. కానీ తాజ్ లాంటి హోటల్ ముందు ఏ వీధి కుక్క వచ్చినా దానికి ఆశ్రయం కల్పించాల్సిందేనని రతన్ ఆదేశాలు జారీ చేసారు. ప్రత్యేకించి వీధి కుక్కల కోసం ఆయన ఓ రూ.800 కోట్ల విలువైన సంస్థను కూడా స్థాపించారు.