Ratan Tata: ట్రోల్ చేసిన యువతిని సైతం పెద్ద మనసుతో క్షమించి..
Ratan Tata: రతన్ టాటా.. మన దేశంలో ఎందరో పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికీ ఈయనకున్న గౌరవం, మర్యాద వేరే లెవల్ అనే చెప్పాలి. రతన్ టాటాను ఇష్టపడినట్లు మరే పారిశ్రామికవేత్తను ఇష్టపడరు అనే భారతీయులు ఉన్నారంటే అందులో ఎలాంటి సందేహం లేదు. తనను ట్రోల్ చేసిన యువతిని సైతం ఆయన క్షమించి ఆమెను అవమానిస్తున్నవారికి బుద్ధిచెప్పారంటే ఆయన మనసు ఎంత విశాలమైందో అర్థంచేసుకోవచ్చు.
2019లో రతన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచారు. ఇంటర్నెట్‌ని ఊపేయడం సంగతి అటుంచితే.. ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతషంగా ఉంది అంటూ రతన్ తొలి పోస్ట్ పెట్టారు. ఆయన ఖాతా తెరిచిన నెల రోజుల్లోనే మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. దాంతో ఆయన మరో పోస్ట్ పెడుతూ.. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారంటే తన పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను చూసి ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ పోస్ట్‌పై ఓ యువతి కంగ్రాట్స్ చోటూ అని ట్రోల్ చేస్తున్నట్లు కామెంట్ చేసారు. దాంతో ఎంతో మంది నెటిజన్లు ఆ యువతిని దారుణంగా ధూషిస్తూ కామెంట్స్ చేసారు.
తనను చోటు అన్న యువతి పట్ల ఇతర నెటిజన్లు, ఫాలోవర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారని రతన్‌కు తెలిసి ఆడవాళ్లకు మర్యాద ఇవ్వాలి. అలా మాట్లాడకూడదు. మనందరిలో ఓ చిన్నారి సజీవంగా ఉంటుంది అని స్వయంగా ఆయన కామెంట్ చేయడం వైరల్‌గా మారింది. ఆ తర్వాత కూడా ఆ యువతిపై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే తొలగించింది. ఈ విషయం కూడా రతన్‌కు తెలీడంతో ఆయన ప్రత్యేకించి ఆ యువతి కోసం ఓ పోస్ట్ పెట్టారు.
ఓ అమాయకురాలు నన్ను చోటూ అని అనడంతో ఆమెను ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే లేకుండా చేసేసారు. ఆమె చోటూ అని చేసిన కామెంట్ కూడా కనిపించడంలేదు. తను నన్ను ట్రోల్ చేయలేదు. నాలో ఓ చిన్నారిని చూసుకున్నట్లుగా చోటూ అని ప్రేమగా పిలిచింది. అది మీకు తప్పుగా అనిపించింది. ఆమె మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తుందని ఆశిస్తున్నా అని పోస్ట్ చేసారు. నిజానికి ఆయనకు ఈ విషయాన్ని ఇంత పర్సనల్‌గా తీసుకుని మరీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓ యువతి తన కోసం చేసిన కామెంట్ వల్ల అవమానాలు ఎదుర్కొందని తెలిసి ఆయన ఇలా పోస్ట్ పెట్టడం నిజంగా అభినందనీయం.