ఈ ఆలయాల్లో రాజకీయ నేతలే దేవుళ్లు..!
Politician Temples: దేవుళ్ల కోసం ఆలయాలు కట్టించడం మామూలే. కానీ మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల కోసం గుళ్లు కట్టించారు. అంతటి స్థాయిలో అభిమానం చాటుకున్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధే అన్న అభిమానంలో కరీంనగర్‌లో ఆమెకు చిన్న గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్థానిక నేతలు, కార్యకర్తలు ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ విశేష సందర్భం ఉన్నా ఈ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానంతో గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో కట్టించిన విగ్రహం ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మోదీ వీరాభిమాని ఒకరు చిన్న గుడిలాంటిది కట్టించి ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయించారు. మోదీ స్వస్థలం అయిన గుజరాత్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోదీ ప్రధాని కాకముందు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో మాజీ దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్‌ల పట్ల ఉన్న అభిమానం వెలకట్టలేనిది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో జయలలిత, ఎంజీఆర్‌ల కోసం కట్టించిన గుళ్లు అందులో వాటి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఎంజీఆర్, జయలలితల ఆత్మలు ఆ విగ్రహాల్లో ఉన్నాయని తమిళ ప్రజల నమ్మకం.
దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కోసం కట్టించిన గుడి, విగ్రహం బిహార్‌లో ఉన్నాయి. భారత్‌ను గ్లోబల్ ఐటీ పవర్ హౌజ్‌గా తీర్చిదిద్దింది రాజీవ్ గాంధీనే అని అక్కడి వారి నమ్మకం.
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కోసం కూడా చిన్న కోవెల కట్టించారు. మాయావతి వల్ల బుందేల్‌ఖండ్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే బుందేల్‌ఖండ్‌తో పాటు నాట్పుర గ్రామంలో ఆమె కోసం విగ్రహాలు కట్టించారు.