Hathras Stampede: మృతదేహాలను చూసి గుండెపోటుతో పోలీస్ మృతి
Hathras stampede: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ ప్రాంతంలో నిన్న చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాట ఘటనలో దాదాపు 121 మంది మృతిచెందారు. భోలే బాబా అనే స్వయం ప్రకటిత బాబా ఏర్పాటుచేసిన సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది భక్తులు తరలి వెళ్లారు. ఆ సమయంలో బాబా కాలి కింద ఉన్న మట్టిని తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని చెప్పడంతో ఆ మట్టి తీసుకునేందుకు ఎగబడ్డారు. దాంతో అక్కడే బాబాకు సెక్యూరిటీగా ఉన్న ఓ వ్యక్తి ఒక భక్తుడిని పక్కకు తోసాడు. అతను కాస్త వెనక్కి జరిగి పడటం వల్ల ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయాలతో చికిత్స పొందుతున్నారు.
అయితే.. ఈ కేసును పరిశీలించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా.. అక్కడ కుప్పలు తెప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి ఓ పోలీస్ అధికారి గుండెపోటుతో మృతిచెందాడట. ఆ అధికారి క్విక్ రెస్పాన్స్ టీంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలాన్ని సందర్శించి పోలీస్ అధికారి కుటుంబానికి సాయం ప్రకటించారు.