Rameshwaram Cafe Blast: పోలీసుల అదుపులో BJP కార్యకర్త
Rameshwaram Cafe Blast: కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కెఫెలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ముందు అందరూ కెఫెలోని సిలిండర్ పేలింది అనుకున్నారు కానీ ఓ వ్యక్తి పేలుడు పదార్థం పెట్టడం వల్ల సంభవించిన పేలుడు అని సీసీటీవీ కెమెరా ద్వారా నిర్ధారణ అయింది. ఎన్నికల సమయం కావడంతో వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. ఈ కేసులో భాగంగా భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక మొబైల్ షాపు వర్కర్లను అధికారులు విచారణ చేపట్టగా.. సాయి ప్రసాద్ అనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త గురించి బయటపెట్టారు. శిమోగా ప్రాంతంలో ఇద్దరు నిందితులకు సంబంధించిన మొబైల్ షాపులు, ఇళ్లను తనిఖీ చేసిన అధికారులు మొత్తానికి సాయి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి దినేష్ గుండురావు స్పందించారు. నిందితుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినప్పుడు ఈ దాడి చేయించింది కూడా భారతీయ జనతా పార్టీనే అని ఎందుకు అనుకోకూడదు అని ప్రశ్నించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమని సమాధానం చెప్తుంది అని నిలదీసారు.
మార్చి 1న రామేశ్వరం కెఫెలో మధ్యాహ్నం 1 గంట సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ముందు అంతా సిలిండర్ పేలిందని అనుకున్నారు. కానీ సీసీటీవీ కెమెరా చెక్ చేయగా ఓ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ చేస్తున్నట్లు నటించి తన చేతిలో ఉన్న సంచిని కెఫె వద్ద వదిలి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన కొన్ని నిమిషాల్లోనే పేలుడు సంభవించింది. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.10 లక్షల వరకు రివార్డు ప్రకటిస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.