Pakistan Woman: ఇండియానే నా దేశం.. ఇక్క‌డే చ‌స్తాను

Noida: ప‌బ్జీలో ప‌రిచ‌యం అయిన వ్య‌క్తి కోసం న‌లుగురు పిల్ల‌ల‌తో క‌లిసి ఇండియాకు వ‌చ్చేసిన‌ పాకిస్థానీ మ‌హిళ (pakistan woman) సీమా హైద‌ర్ ఇండ‌యాలోనే ఉంటాన‌ని ప‌ట్టుబ‌ట్టింది. ఈ మేర‌కు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రిక్వెస్ట్ చేసింది. పాకిస్థాన్‌కు వెళ్తే త‌న‌ను రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌ని అదేదో ఇక్క‌డే చ‌స్తాన‌ని అంటోంది. దాంతో ఇప్పుడు యోగి ప్ర‌భుత్వం ఏం చేయాలా అని ఆలోచిస్తోంది.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైద‌ర్ అనే మ‌హిళ పబ్జీ గేమ్ తెగ ఆడుతుండేది. అలా గేమ్‌లో యూపీలోని నోయిడాకు చెందిన సచిన్ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం పెంచుకుంది. అలా వారిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. ఆమెను ఇండియాకు వ‌చ్చేయాల‌ని సచిన్ చెప్పాడ‌ట‌. దాంతో ముందు వెన‌క ఆలోచించకుండా పిల్ల‌ల‌తో క‌లిసి నేపాల్ బోర్డ‌ర్ నుంచి అక్ర‌మంగా ఇండియాలోకి అడుగుపెట్టింది. అలా జులై 4న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

త‌నను నోయిడాకు చెందిన స‌చిన్ రమ్మ‌న్నాడ‌ని చెప్పింది. దాంతో అక్ర‌మంగా వ‌స్తున్న వ‌ల‌స‌దారులకు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నాడ‌న్న నెపంతో పోలీసులు అత‌న్ని కూడా అరెస్ట్ చేసారు. కాగా.. ఈరోజు ఉద‌య‌మే వారిద్ద‌రూ బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఈ మేర‌కు సీమా మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌ను పాకిస్థాన్‌కు పంప‌కండి అని వేడుకుంటోంది. అక్క‌డికి వెళ్తే రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌ని ఆ చావేదో ఇక్క‌డే చ‌స్తాన‌ని అంటోంది. మ‌రోప‌క్క స‌చిన్ కూడా సీమాను ఆమె న‌లుగురు పిల్ల‌ల‌ను చూసుకుంటాన‌ని అంటున్నాడు.

విష‌యం సౌదీ అరేబియాలో ఉన్న సీమా భ‌ర్త గులామ్ హైద‌ర్‌కు తెలిసింది. దాంతో అత‌ను వీడియో కాల్ ద్వారా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రిక్వెస్ట్ పెట్టాడు. త‌న భార్య చేసింది త‌ప్పే అని నోయిడాకు చెందిన వ్య‌క్తి ఏవేవో చెప్పి సీమా మ‌న‌సు మార్చేసాడ‌ని అన్నాడు. ఇంకెప్పుడూ ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని, క్షేమంగా త‌న భార్య పిల్ల‌ల్ని పాకిస్థాన్‌కు త‌ర‌లించాల‌ని వేడుకున్నాడు.