Pakistan: భారత్ నుంచి రక్షణగా.. చైనా సాయం కోరిన పాకిస్థాన్
Pakistan: భారత డిఫెన్స్ బలగాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు దాయాది దేశమైన పాకిస్థాన్.. డ్రాగన్ (చైనా)ను ఆశ్రయించింది. న్యూక్లియర్ క్షిపణులు కలిగిన జలాంతర్గాములను తయారు చేయాలని పాకిస్థాన్ మిలిటరీ చైనాను కోరింది. ఈ నేపథ్యంలో చైనా ఆ పనిలో నిమగ్నమైంది. ఇందుకోసం డ్రాగన్ హ్యాంగర్ క్లాస్ జలాంతర్గాములను తయారుచేస్తోంది. వీటికి న్యూక్లియర్ క్షిపణులను మోసే సామర్థ్యం ఉంటుంది.
ఈ పని పాకిస్థాన్ ఎప్పుడో చేయాల్సింది కానీ అప్పుల ఊబిలో కూరుకుపోవడం వల్ల చైనా మా వల్ల కాదు అని చేతులెత్తేసింది. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు ఉన్నట్టుండి పాకిస్థాన్‌కు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కానీ పాకిస్థాన్ అడిగిన 8 జలాంతర్గాములను 2030 నాటికల్లా సిద్ధం చేసి ఇస్తాం అని చైనా మాటిచ్చింది.
ఈ జలాంతర్గాములు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే టెక్నాలజీతో తయారవుతున్నాయి. ఈ టెక్నాలజీతో జలాంతర్గాముల సామర్థ్యం రెట్టింపు అవుతుంది. భారత సాయుధ బలగాలను ఎదుర్కొనేందుకు 1998 నుంచి పాకిస్థాన్ టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను వాడుతోంది. కానీ భారతదేశ క్షిపణి పాలసీ ప్రకారం.. పాకిస్థాన్ టాక్టికల్ క్షిపణులను ప్రయోగించడానికి వీల్లేదు. అందుకే పాకిస్థాన్ ఆ క్షిపణులకు రాం రాం చెప్పి చైనా ముందు చేయిచాచింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ చైనాతో సంప్రదింపులు జరిపింది. చైనా చేత తయారు చేయిస్తున్న హ్యాంగర్ క్లాస్ జలాంతర్గాముల్లోని న్యూక్లియర్ క్షిపణులు 450 కిలోమీటర్లు దూరంలో ఉన్న టార్గెట్‌ను కూడా ధ్వంసం చేయగలవట.
ఇండియన్ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు భారత నేవీ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో చైనా పాకిస్థాన్ సాయం తీసుకుంటోంది. అందుకే పాకిస్థాన్ అడిగిన సబ్‌మెరైన్లు తయారుచేసి ఇచ్చేందుకు ఒప్పుకుందట. పాకిస్థాన్ ఈ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను మోహరించాలంటే ముందు పాకిస్థాన్‌కు చెందిన జలాంతర్గాములు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాల్సి ఉంది.