Hyderabad: ఇల్లు రెంట్‌కి ఇస్తున్నారా.. జాగ్ర‌త్త‌!

Hyderabad: ఇళ్లు అద్దెకు (rental houses) తీసుకునేవారి సంఖ్య ఈ మ‌ధ్య‌కాలంలో విప‌రీతంగా పెరిగిపోయింది. హైద‌రాబాద్ (hyderabad) లాంటి మ‌హాన‌గ‌రంలో ఎక్కువ మంది ఉద్యోగులే ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఎవ‌రికైనా ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి గురించి పక్కాగా అన్ని విష‌యాలు క‌నుక్కుని ఇవ్వడం మంచిద‌ని హైద‌రాబాద్ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఇందుకు కార‌ణం హ‌య‌త్‌న‌గ‌ర్‌లో నిన్న ఉద‌యం చోటుచేసుకున్న దారుణ‌మైన హ‌త్యే. తొర్రూరుకు చెందిన స‌త్తెమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు త‌న ఇంట్లో ఒంట‌రిగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం త‌న ఇంటి పైన ఉన్న పోర్ష‌న్ ఖాళీగా ఉండ‌టంతో అద్దెకు ఇవ్వాల‌నుకుంది. అదే స‌మ‌యంలో ల‌లిత అనే ఓ మ‌హిళ రూం అద్దెకు కావాల‌ని వ‌చ్చింది. ఒంటరిగా ఉంటున్న స‌త్తెమ్మ తోడుగా ఉంటుంది క‌దా అని గ‌దిని అద్దెకు ఇచ్చింది.

ల‌లిత తొర్రూరు ప్రాంతానికి చెందిన రాకేష్ అనే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఈ విష‌యాలేవీ స‌త్తెమ్మ‌కు తెలీవు. ఓ రోజు రాకేష్‌..ల‌లిత‌ను ఇంటి ద‌గ్గ‌ర దింప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు స‌త్తెమ్మను చూసాడు. ఆమె ఒంటినిండా బంగారం ఉండ‌టం చూసి ల‌లిత‌తో క‌లిసి ప్లాన్ వేసాడు. అలా ఆదివారం రాత్రి స‌త్తెమ్మ నిద్ర‌పోవ‌డానికి వెళ్ల‌గానే ల‌లిత‌, రాకేష్‌లు ఆమెను దారుణంగా చంపి న‌గ‌లు దోచుకున్నారు. నిన్న ఉద‌యం స్థానిక పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో సాయంత్రంలోగా నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒంట‌రిగా ఉంటున్నవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, తోడు కోసం ఇళ్లు అద్దెకు ఇచ్చే విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల‌ని పోలీసులు హెచ్చ‌రించారు.