Green Card: రిస్క్‌లో ల‌క్ష మంది భార‌తీయులు

అమెరికాలో (america) ఉంటున్న దాదాపు ల‌క్ష‌కు పైగా భార‌తీయ దంప‌తుల పిల్ల‌లు వారి త‌ల్లిదండ్రుల‌కు దూరం కావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది. ఇందుకు కార‌ణం అమెరికన్ ప్ర‌భుత్వం గ్రీన్ కార్డుల‌ను (green card) జారీ చేయ‌డంలో చేస్తున్న జాప్య‌మే. దాదాపు 10.7 ల‌క్ష‌ల మంది భార‌తీయులు గ్రీన్ కార్డుల‌ను అప్లై చేసి అవి ఎప్పుడు వ‌స్తాయా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఒక్కో దేశానికి చెందిన 7 శాతం మందికే అమెరికా గ్రీన్ కార్డులు జారీ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో కొన్ని ల‌క్ష‌ల గ్రీన్ కార్డు అప్లికేష‌న్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడున్న గ్రీన్ కార్డు అప్లికేష‌న్లు అన్నీ క్లియ‌ర్ చేయాలంటే అమెరిక‌న్ ప్ర‌భుత్వానికి ఏకంగా 135 ఏళ్లు ప‌డుతుంద‌ట‌.

గ్రీన్ కార్డు అప్లికేష‌న్లు చెక్ చేసి జారీ చేసే లోపు దాదాపు ల‌క్ష మందికి పైగా భార‌తీయుల పిల్ల‌లకు 21 ఏళ్లు వ‌చ్చేస్తాయి. పిల్ల‌లు H-4 వీసా కేట‌గిరీ కిందికి వ‌స్తారు కాబ‌ట్టి ఆ త‌ర్వాత వారు అమెరికాలో ఉండ‌టానికి అనుమ‌తి లేదు. దాంతో బ‌ల‌వంతంగా వారిని త‌ల్లిదండ్రుల నుంచి దూరం చేయాల్సి ఉంటుంది. మ‌ర‌ణం, వృద్ధాప్యం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా అన్ని గ్రీన్ కార్డుల‌ను ప‌రిశీలించి జారీ చేయ‌డానికి ఎంతకాద‌న్నా 54 ఏళ్లు ప‌డుతుంద‌ట‌. (green card)

ఇత‌ర దేశాల‌కు చెందిన త‌ల్లిదండ్రులు అమెరికాలో ఉంటూ.. ఆ త‌ర్వాత వారి పిల్ల‌లు కూడా అమెరికాకు వెళ్తే వారికి H-4 వీసా కేట‌గిరీ కింద ఉండ‌టానికి అనుమ‌తి ఇస్తారు. అది కూడా ఆ త‌ల్లిదండ్రులకు H-1B ఉంటేనే చెల్లుతుంది. ఆ త‌ర్వాత పిల్ల‌ల వ‌య‌సు 21 వ‌స్తే వారికి H-4 వీసా వ‌ర్తించ‌దు. అప్పుడు దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే.. ఆ పిల్ల‌లు F-1 (స్టూడెంట్ వీసా) వీసా తీసుకోవాలి. ఈ వీసా ద్వారా వారికి అమెరికాలో చ‌దువుకునే అవ‌కాశం ఉంటుంది. కాక‌పోతే ఎంప్లాయ్‌మెంట్ ఆథ‌రైజేష‌న్ డాక్యుమెంట్ (EAD) లేకుండా వారు ఎలాంటి ఉద్యోగాలు చేసే అవ‌కాశం ఉండ‌దు. (green card)

పోనీ 21 ఏళ్లు వ‌చ్చిన పిల్ల‌లు అంద‌రికీ ఈ F-1 వీసా వ‌స్తుందా అంటే ఇంపాజిబుల్. దీనికి కూడా క్యాప్ అంటే లిమిట్ ఉంటుంది. ఇక ఈ EAD అప్లికేషన్ పొంద‌డం అంటే క‌త్తిమీద సాము అనే చెప్పాలి. ఈ ప్రాసెస్ ఖ‌ర్చుతో కూడుకున్న‌ది అంద‌రికీ ఇస్తార‌న్న గ్యారెంటీ లేదు. ఇవేవీ వ‌ద్దు అనుకుంటే.. 21 ఏళ్లు వ‌చ్చాక పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి స్వ‌దేశాల‌కు వెళ్లిపోవాల్సిందే. దాంతో ఇప్పుడు దాదాపు 1.35 ల‌క్ష‌ల భార‌తీయుల ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా మారింది. వారిలో చాలా మంది ఇండియాలో అన్నీ అమ్మేసుకుని ప‌ర్మ‌నెంట్‌గా అమెరికాలో సెటిల్ అయిపోవాల‌ని వెళ్లిన‌వారే ఉన్నారు. ఆ గ్రీన్ కార్డులు రాక‌పోతే.. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏంటా అని ఆందోళ‌న చెందుతున్నారు.