Qatar Releases Indians: ఒకరు మిస్సింగ్.. అతను ఏమైపోయినట్లు?
Qatar Releases Indians: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొని దాదాపు 18 నెలల పాటు ఖతార్ (Qatar) జైల్లో ఉన్న భారత దేశానికి చెందిన 8 మంది నేవీ అధికారులు ఎట్టకేలకు విడుదల అయ్యారు. వారు ఈరోజు ఉదయం భారత్‌కు చేరుకున్నారు. అయితే వారిని ఇళ్లను పంపించకుండా ముందు విదేశాంగ శాఖ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కొన్ని వివరాలు తీసుకుని ఆ తర్వాత ఇంటికి పంపించే అవకాశం ఉంది.
అయితే ఎనిమిది మంది అధికారుల్లో కేవలం ఏడుగురు మాత్రమే భారత్‌కు చేరుకున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం మిస్సయ్యారు. అతను ఏమైపోయారు? ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను అధికారులు కూడా ఇంకా వెల్లడించలేదు. ఓ నేవీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కలగజేసుకోకపోయి ఉంటే తాము బతికి ఇలా ఇండియా చేరుకునేవాళ్లం కాదని ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఎప్పటికప్పుడు భారత్ ప్రభుత్వం తమ గురించి తెలుసుకుంటూ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది కాబట్టే ప్రాణాలతో బయటపడ్డామని అన్నారు.
మరో అధికారి మాట్లాడుతూ.. “” మేం దాదాపు 18 నెలల పాటు ఇండియాకు ఎప్పుడెప్పుడు వస్తామా అని జైల్లో ఎదురుచూస్తూ కూర్చున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆయన పర్సనల్‌గా ఈ విషయాన్ని తీసుకుని మా కోసం పోరాడకపోయి ఉంటే బతికేవాళ్లం కూడా కాదు. ప్రధానికి ఖతార్‌తో మంచి సత్సంబంధాలు ఉండటం కూడా మేం బయటపడటానికి ఒక కారణం. మాకోసం ఎంతో కష్టపడి మమ్మల్ని మా కుటుంబాల వద్దకు చేరుస్తున్న భారత ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం “” అని తెలిపారు.
మన అధికారులను ఖతార్ ఎందుకు అరెస్ట్ చేసింది?
Qatarలో గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం వారిని 2022లో అదుపులోకి తీసుకుంది. వీరంతా అప్పట్లో అల్ దహ్రా అనే కంపెనీలో పనిచేస్తుండేవారు. వీరు జలాంతర్గామికి సంబంధించిన అంశంలో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిని అదుపులోకి తీసుకుంది. వీరంతా భారత్‌కు చెందినవారు కావడంతో ఇక్కడి ప్రభుత్వంలో మాట్లాడించే ప్రయత్నం కూడా చేసింది. భారత ప్రభుత్వం వారిని విడిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది కానీ అవేవీ ఫలించలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసు విషయంలో ఖతార్ న్యాయస్థానం తీర్పు వెల్లడిస్తూ వారికి మరణ శిక్షను విధించింది.
భారత ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి పడిన మరణ శిక్షను రద్దు చేయడానికి అప్పీలు దాఖలు చేయగా అక్కడి న్యాయస్థానం వాదనలు వినేందుకు ఒప్పుకుంది. ఆ తర్వాత భారత్ తరఫున న్యాయవాది వాదనల పట్ల సంతృప్తి చెందిన న్యాయమూర్తి మరణ శిక్ష అవసరం లేదని తీర్పు ఇచ్చారు. అయితే మరణశిక్షను రద్దు చేసినప్పటికీ శిక్షను తగ్గించి జైల్లో పెడతారేమోనని అంతా అనుకున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం వారికి ఇక ఎలాంటి శిక్ష పడనివ్వకుండా అందరినీ క్షేమంగా వెనక్కి రప్పించింది. అయితే ఎనిమిది మంది భారత నేవీ అధికారుల్లో ఒక్క వ్యక్తి మాత్రం ఇండియాకు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతనికి ఏమన్నా జరిగిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.